రేపు తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. ఈ మేరకు ప్రోటోకాల్ ప్రకారం సీఎం కేసీఆర్ కు ఆహ్వానం అందింది. అయితే ఆయన ఈసారైనా ప్రధానికి స్వాగతం చెప్పడానికి వెళ్తారా? లేదా గతంలో మాదిరి మంత్రినే పంపిస్తారా అనే దానిపై సస్పెన్స్ నెలకొంది. గతంలో మాదిరిగానే ఈసారి కూడా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రధానికి స్వాగతం చెప్పబోతున్నారని తెలుస్తుంది. ప్రధాని పర్యటన ప్రతిసారి కూడా కేసీఆర్ దూరం ఉంటున్నారు. ఇక రేపటి ప్రధాని పర్యటనకు కేసీఆర్ వెళ్తారా లేదా అనే దానిపై క్లారిటీ వచ్చింది. రేపు ప్రధాని మోదీకి స్వాగతం చెప్పడానికి కేసీఆర్ వెళ్లరని బీఆర్ఎస్ నేత వినోద్ కుమార్ చెప్పుకొచ్చారు. అంతేకాదు దీనికి గల కారణాలను ఆయన వెల్లడించారు.
గతంలో రాష్ట్ర పర్యటనకు వచ్చిన సమయంలో సీఎం కేసీఆర్ ను రావద్దని ప్రధాని చెప్పారని వినోద్ కుమార్ గుర్తు చేశారు. కరోనా సమయంలో ప్రోటోకాల్ పాటించలేదని..ప్రోటోకాల్ పాటించకుండా కేసీఆర్ ను మోదీ అవమానించారని తెలిపారు. ఆనాడు మోదీ చూపిన బాటలోనే తాము వెళ్తున్నామని వినోద్ కుమార్ అన్నారు. సంకుచిత మనస్తత్వం ఉన్న వ్యక్తి మోదీ అని..ఈ కారణంగానే రాజ్యాంగబద్దంగా సీఎంగా ఎన్నికైన కేసీఆర్ ను మోదీ అవమానించారని వినోద్ కుమార్ మండిపడ్డారు. కాగా గతంలో ప్రోటోకాల్ ప్రకారం కేసీఆర్ ను పిలవలేదని..ఈసారి పిలిచినా వెళ్ళేది లేదని బీఆర్ఎస్ నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది.