అమరావతిలో జరుగుతున్న రాజధాని నిర్మాణాలపై మంత్రి పొంగూరు నారాయణ కీలక ప్రకటన చేశారు. సీఆర్డీఏ భవన నిర్మాణ పనులు ఈ నెలాఖరుకు పూర్తవుతాయని, మూడేళ్లలో తొలిదశ అమరావతి నిర్మాణ పనులు పూర్తి చేస్తామని ఆయన వెల్లడించారు.
మంత్రి నారాయణ అమరావతి అభివృద్ధి సంస్థ ఛైర్పర్సన్ డి.లక్ష్మీపార్థసారథితో కలిసి భవన నిర్మాణ పనులను ప్రత్యక్షంగా పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, “ఈ భవనం సుమారు 3 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మితమవుతోంది. అదనంగా, పక్కనే 1.60 లక్షల చదరపు అడుగుల్లో అనుబంధ నిర్మాణాలు కొనసాగుతున్నాయి,” అని తెలిపారు. దసరా సందర్భంగా ఈ భవనాన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని మంత్రి వెల్లడించారు.
2014-19 మధ్యనే ఈ భవన నిర్మాణం పూర్తయినప్పటికీ, తరువాత వచ్చిన ప్రభుత్వం పనులను నిలిపివేసిందని ఆయన ఆరోపించారు. “ఇప్పుడు మళ్లీ టెండర్లు పిలిచి మిగిలిన పనులను పూర్తి చేస్తూ, అమరావతిని వేగంగా అభివృద్ధి చేస్తున్నాం,” అని మంత్రి నారాయణ స్పష్టం చేశారు.
దుష్ప్రచారంపై తీవ్రంగా స్పందన
కొంత మంది కావాలనే అమరావతిపై దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. “కొండవీటి వాగులో నీటిని చూపుతూ వైసీపీ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారు. వాస్తవంగా, వాగులోని అడ్డంకులను తొలగించాం. భవిష్యత్తులో ఎంత పెద్ద వర్షం వచ్చినా అమరావతిలో నీరు నిలిచే అవకాశమే లేదు,” అని స్పష్టం చేశారు. వరద నివారణ కోసం రిజర్వాయర్లు, గ్రావిటీ కెనాల్స్ నిర్మాణం వేగంగా కొనసాగుతున్నట్లు తెలిపారు.
ఉద్యోగుల నివాస భవనాలు – మార్చిలో సిద్ధం
అమరావతిలో ప్రభుత్వ ఉద్యోగుల కోసం నిర్మిస్తున్న నివాస భవన సముదాయాలు వచ్చే ఏడాది మార్చి నాటికి సిద్ధమవుతాయని తెలిపారు. అలాగే, మూడేళ్లలో అమరావతిలో తొలిదశ నిర్మాణం పూర్తయ్యేలా ప్రణాళికాబద్ధంగా పనిచేస్తున్నామని పేర్కొన్నారు.