తెలంగాణలో యూరియా లభ్యతపై రైతులు ఎదుర్కొంటున్న సమస్యల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. నిన్నటికి 9 వేల టన్నుల యూరియా రాష్ట్రానికి సరఫరా అయిందని, ఈరోజు రాత్రికి మరో 5 వేల టన్నుల యూరియా వస్తోందని ప్రభుత్వం తెలిపింది.
రానున్న వారం రోజుల్లో రాష్ట్రానికి 27,470 టన్నుల యూరియా చేరుకుంటుందని అధికారులు వెల్లడించారు. రైతులెవ్వరూ ఇబ్బంది పడకుండా యూరియా పంపిణీ సక్రమంగా జరిగేలా చూడాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా, వరదల కారణంగా పంట నష్టంపై 5 రోజుల్లో సర్వే పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.