యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రాబోతున్న భారీ యాక్షన్ చిత్రంపై నెలకొన్న సస్పెన్స్ వీడింది. ఈ సినిమాలో హీరోయిన్గా కన్నడ నటి రుక్మిణి వసంత్ నటిస్తున్నారంటూ గత కొన్నాళ్లుగా సాగుతున్న ప్రచారమే నిజమని తేలింది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాత ఎన్వీ ప్రసాద్ ధ్రువీకరించడంతో అభిమానుల ఊహాగానాలకు తెరపడింది.
‘సప్త సాగరాలు దాటి’ చిత్రంతో ఒక్కసారిగా దక్షిణాది ప్రేక్షకులను ఆకట్టుకున్న రుక్మిణి వసంత్‌కు అప్పటి నుంచి అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ ప్రాజెక్టులో ఆమెను హీరోయిన్గా ఎంపిక చేశారనే వార్తలు బలంగా వినిపించాయి. తాజాగా శివకార్తికేయన్, ఏఆర్ మురుగదాస్ కాంబోలో వస్తున్న ‘మదరాసి’ సినిమా ఈవెంట్లో నిర్మాత ఎన్వీ ప్రసాద్ మాట్లాడుతూ.. ఎన్టీఆర్ సినిమాలో రుక్మిణి వసంత్ భాగమని స్పష్టం చేశారు. దీంతో సోషల్ మీడియాలో ఎన్టీఆర్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.
నిర్మాత ఈ విషయాన్ని ధ్రువీకరించినప్పటికీ, చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ‘డ్రాగన్’ అనే వర్కింగ్ టైటిల్‌తో ప్రచారంలో ఉన్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే, ఈ చిత్రాన్ని 2026 జూన్ 25న ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.