AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

స్మితా సభర్వాల్‌పై చర్యలు తీసుకోండి.. ప్రభుత్వానికి పీసీ ఘోష్ కమిషన్ సిఫార్సు..

కాళేశ్వరం ప్రాజెక్టులోని మూడు కీలక బ్యారేజీల నిర్మాణ వ్యవహారంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాజీ కార్యదర్శి, సీనియర్ ఐఏఎస్ అధికారిణి స్మితా సభర్వాల్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఈ బ్యారేజీల నిర్మాణంలో ఆమె పాత్ర అత్యంత కీలకమని తేల్చిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ తన విధుల్లో స్మిత తీవ్ర నిర్లక్ష్యం వహించారని ఘాటు వ్యాఖ్యలు చేసింది. అంతేకాకుండా, ఆమెపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి గట్టిగా సిఫార్సు చేసింది.

 

పీసీ ఘోష్ కమిషన్ తన నివేదికలో స్మితా సభర్వాల్ విచారణకు సంబంధించిన కీలక అంశాలను పొందుపరిచింది. అన్నారం, సుందిళ్ల, మేడిగడ్డ బ్యారేజీల నిర్మాణ ప్రతిపాదనలను క్యాబినెట్ ముందు ఉంచారా? అని కమిషన్ ప్రశ్నించగా తొలుత ‘అవును, అన్ని అంశాలు క్యాబినెట్ దృష్టికి తీసుకెళ్లాం’ అని ఆమె బదులిచ్చారు. అయితే, సంబంధిత జీవో 776లో ఆ ప్రస్తావన లేదనే విషయాన్ని ప్రస్తావిస్తూ కమిషన్ క్రాస్ ఎగ్జామిన్ చేయగా స్మిత తన సమాధానాన్ని మార్చి ‘నాకేమీ తెలియదు’ అని చెప్పినట్లు నివేదిక స్పష్టం చేసింది.

 

విచారణ సందర్భంగా ఈ మూడు బ్యారేజీల ప్రణాళిక, నిర్మాణం, నాణ్యత పర్యవేక్షణ వంటి అంశాలతో తనకు ఎలాంటి సంబంధం లేదని స్మితా సభర్వాల్ వాదించారు. ముఖ్యమంత్రికి దస్త్రాలు వివరించడం, క్షేత్రస్థాయిలో పర్యటించి నివేదికలు ఇవ్వడం మాత్రమే తన బాధ్యత అని ఆమె పేర్కొన్నారు. అయితే, ఆమె వాదనలు పూర్తిగా అవాస్తవమని కమిషన్ కొట్టిపారేసింది. సీఎం ప్రత్యేక కార్యదర్శి హోదాలో ఆమె నీటిపారుదల శాఖ అధికారులకు స్వయంగా లేఖలు రాయడం, సమీక్షలు నిర్వహించడం, ఆదేశాలు జారీ చేయడం వంటి బలమైన ఆధారాలను తన నివేదికలో ప్రస్తావించింది.

 

బ్యారేజీలకు సంబంధించి మొత్తం 11 ప్రశ్నలు అడగగా చాలావాటికి ‘తెలియదు’ అనే సమాధానమే ఇచ్చారని కమిషన్ పేర్కొంది. సీఎం కార్యదర్శిగా అంతటి కీలక పదవిలో ఉండి కూడా తన విధులను పూర్తిగా విస్మరించారని, తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించారని వ్యాఖ్యానించింది. ఇన్ని ఆధారాలు కళ్లముందు కనిపిస్తున్నప్పటికీ, తన పాత్ర లేదంటూ ఆమె బుకాయించారని తప్పుబట్టింది. ఈ నేపథ్యంలోనే, ఆమెపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి పీసీ ఘోష్ కమిషన్ సిఫార్సు చేయడం గమనార్హం.

ANN TOP 10