AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

మోదీకి జపాన్‌లో ప్రత్యేక కానుక..! ఏమిటంటే..,?

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన జపాన్ పర్యటనలో భాగంగా తొలిరోజునే ఒక ప్రత్యేకమైన బహుమతిని అందుకున్నారు. జపాన్ సంస్కృతిలో విశిష్ట స్థానమున్న ‘దరుమా బొమ్మ’ను దరుమాజీ ఆలయ ప్రధాన పూజారి రెవ్ సైషీ హిరోసే ఆయనకు బహూకరించారు. చూడటానికి సాధారణ బొమ్మలా కనిపించినప్పటికీ, దీని వెనుక ఉన్న చరిత్ర, దీని మూలాలు భారతదేశంతో ముడిపడి ఉండటం విశేషం.

 

ఏమిటీ దరుమా బొమ్మ ప్రత్యేకత?

 

జపాన్‌లో దరుమా బొమ్మను పట్టుదలకు, అదృష్టానికి చిహ్నంగా భావిస్తారు. కాగితపు గుజ్జుతో తయారుచేసే ఈ బొమ్మను లక్ష్యాలను నిర్దేశించుకోవడానికి, వాటిని సాధించడానికి ఒక సంకేతంగా ఉపయోగిస్తారు. దీని కింది భాగం గుండ్రంగా ఉండటం వల్ల, కింద పడేసినా వెంటనే తిరిగి లేచి నిలబడుతుంది. “ఏడుసార్లు పడినా, ఎనిమిదోసారి లేచి నిలబడాలి” అనే జపాన్ సామెతకు ఇది ప్రతిరూపంగా నిలుస్తుంది.

 

ఆ దేశ సంప్రదాయం ప్రకారం, ఏదైనా ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకున్నప్పుడు ఈ బొమ్మకు ఒక కన్ను దిద్దుతారు. ఆ లక్ష్యం లేదా కోరిక నెరవేరిన తర్వాత రెండో కన్ను వేసి తమ విజయాన్ని పూర్తిచేస్తారు.

 

భారతదేశంతో విడదీయరాని బంధం

 

ఈ బొమ్మకు స్ఫూర్తి మన దేశానికి చెందిన బౌద్ధ సన్యాసి బోధిధర్ముడు. 5వ శతాబ్దానికి చెందిన బోధిధర్ముడు కాంచీపురంలో జన్మించారు. ఆయన జెన్ బౌద్ధమత స్థాపకుడిగా ప్రసిద్ధి చెందారు. జపాన్‌లో ఆయన్ను ‘దరుమా దైషీ’గా ఎంతో గౌరవిస్తారు. చైనాలోని హెనాన్ ప్రావిన్స్‌లో ఒక గుహలో ఆయన చేతులు, కాళ్లు ముడుచుకుని ఏకధాటిగా తొమ్మిదేళ్లపాటు ధ్యానం చేశారని చెబుతారు. ఆయన ధ్యాన భంగిమకు ప్రతీకగానే ఈ బొమ్మకు కాళ్లు, చేతులు లేకుండా గుండ్రంగా రూపొందించారు.

 

సంస్కృతంలోని ‘ధర్మ’ అనే పదం నుంచే ‘దరుమా’ అనే పేరు వచ్చిందని కూడా చెబుతారు. ఒక భారతీయ సన్యాసి స్ఫూర్తితో జపాన్‌లో ఒక సాంస్కృతిక చిహ్నం రూపుదిద్దుకోవడం ఇరు దేశాల మధ్య ఉన్న చారిత్రక, సాంస్కృతిక బంధానికి నిదర్శనంగా నిలుస్తోంది.

ANN TOP 10