AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

బీజేపీలో చేరిన మాజీ సీఎం కిరణ్‌కుమార్‌ రెడ్డి

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌ కుమార్ రెడ్డి బీజేపీలో చేరారు. కొద్దిరోజుల క్రితమే కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన ఇవాళ ఢిల్లీలో కేంద్ర మంత్రి జేపీ నడ్డా సమక్షంలో కాషాయం కండువా కప్పుకున్నారు. మంత్రి ప్రహ్లాద్‌ జోషి, ఎంపీ డాక్టర్‌ లక్ష్మణ్‌తో పాటు పలువురు జాతీయ నేతలు కిరణ్‌కుమార్‌ రెడ్డిని అధికారికంగా బీజేపీలోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన కాంగ్రెస్‌ అధిష్టానం తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘ 1962 నుంచి మా కుటుంబానికి కాంగ్రెస్ తో అనుబంధం ఉంది. మా తండ్రి చాలా తక్కువ వయస్సులోనే చనిపోయారు. కాంగ్రెస్‌ను వీడాల్సి వస్తుందని నేను అనుకోలేదు. నేను కాంగ్రెస్ పార్టీకి రెండో సారి రాజీనామా చేశాను. ఒకసారి రాష్ట్ర విభజన సమయంలో రాజీనామా చేశాను. మళ్లీ ఆ పార్టీలో చేరి బలోపేతం చేద్దాం అనుకున్నాను. కానీ ఆ పార్టీలో ఆ పరిస్థితి కనిపించలేదు. పొరపాటు జరిగినప్పుడు విశ్లేషించుకుని, జరిగిన తప్పును సరిదిద్దుకోవాలి. కానీ కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. వైద్యుడు దగ్గరికి వెళ్లి టెస్టులు వద్దు, మందులు వద్దు అన్నట్టుగా కాంగ్రెస్ పనిచేస్తోంది. ప్రజలు ఎందుకు బీజేపీని కోరుకుంటున్నారు అని కాంగ్రెస్ ఆలోచించడం లేదు. ఒక రాష్ట్రం తర్వాత మరో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తప్పుల మీద తప్పులు చేసుకుంటూ పోతున్నారు. ఎవరి సలహాలు తీసుకోవడం లేదు. వాళ్లకు అజమాయిషీ తప్ప బాధ్యత వద్దు అన్నట్టుగా ఉంది అక్కడ పరిస్థితి.

నడ్డాకు థ్యాంక్స్‌
‘2 సీట్ల నుంచి బీజేపీ 303 సీట్లకు చేరుకుంది. ఎంతో శ్రమ, హార్డ్ వర్క్ కారణంగా బీజేపీ ఈ స్థాయికి వచ్చింది. ఎవరైనా ఓడిపోతే, కారణం ఏంటో తెలుసుకోవాలి. విశ్లేషించుకోవాలి. కానీ కాంగ్రెస్ లో అది జరగడం లేదు. ప్రజా తీర్పును కాంగ్రెస్ ఒప్పుకోలేకపోయింది. ఓటు వేస్తున్న ప్రజలే తప్పు, నాది ఏ తప్పూ లేదు అన్నట్టుగా కాంగ్రెస్ ప్రవర్తిస్తోంది. ఇదే నేను పార్టీ వీడడానికి ప్రధాన కారణం. బీజేపీ గురించి మాట్లాడాల్సి వేస్తే నేషన్ బిల్డింగ్, అభివృద్ధి అనేదే గుర్తుకొస్తుంది. పార్టీలో, ప్రభుత్వంలో క్లారిటీ ఉంది. పేదలకు సేవ చేయడమే, దేశానికి సేవ చేయడం అన్నట్టుగా పనిచేస్తోంది. సాహసోపేత నిర్ణయాలు తీసుకోవడం బీజేపీ – మోడీ సర్కారుకు ప్రామాణికంగా మారింది. దేశం కోసం, యువత కోసం, పేదల కోసం అన్న నినాదంతో పార్టీ ముందుకెళ్తోంది. ప్రతి చోటా విజయం సాధించాలి అనే తపనతో బీజేపీ పనిచేస్తోంది. నేను సీఎంగా ఉన్నప్పుడు, మోడీ గుజరాత్ సీఎంగా ఉన్నారు. కొన్ని సమావేశాల్లో కలిశాను. అప్పటి నుంచే అవినీతి కి వ్యతిరేకంగా పనిచేస్తూ వచ్చారు. పార్టీలో చేర్చుకున్న నడ్డా గారికి థాంక్స్’ అని చెప్పుకొచ్చారీ మాజీ ముఖ్యమంత్రి.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10