భారత్‌తో వాణిజ్య సంబంధాలపై అమెరికా మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. భారత దిగుమతులపై 50 శాతం భారీ సుంకాలు విధించడానికి సిద్ధమవుతున్న తరుణంలో, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాణిజ్య సలహాదారు పీటర్ నవారో సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్‌ను ‘టారిఫ్‌ల మహారాజ్’ అని అభివర్ణిస్తూ, రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తూ లాభాలు గడిస్తోందని అక్కసు వెళ్లగక్కారు.
వైట్‌హౌస్ వెలుపల విలేకరులతో మాట్లాడుతూ, ముందుగా ప్రకటించినట్లే భారత దిగుమతులపై అదనపు సుంకాలు వచ్చే వారం, అంటే ఆగస్టు 27 నుంచి కచ్చితంగా అమలులోకి వస్తాయని నవారో స్పష్టం చేశారు. “రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముందు భారత్ దాదాపుగా రష్యా నుంచి చమురు కొనేది కాదు. ఇప్పుడు ఆ వాటా 35 శాతానికి పెరిగిపోయింది. ఇది కేవలం అవసరాల కోసం కాదు, ఇదొక లాభార్జన పథకం. రష్యాకు డబ్బులు చేరవేసే మార్గం” అని ఆయన తీవ్రంగా విమర్శించారు.
భారత్ చౌకగా రష్యా చమురు కొని, దాన్ని శుద్ధి చేసి యూరప్, ఆఫ్రికా, ఆసియా దేశాలకు అధిక ధరలకు విక్రయిస్తోందని నవారో ఆరోపించారు. “దీని ద్వారా వచ్చే డబ్బును రష్యా ఆయుధాలు కొనడానికి వాడుతోంది. ఇది ఉక్రెయిన్‌లో రక్తపాతానికి కారణమవుతోంది. ఈ విషయంలో భారత్ తన పాత్రను గుర్తించడానికి ఇష్టపడటం లేదు” అని ఆయన అన్నారు.
అమెరికా తీరుపై భారత్ విస్మయం
అమెరికా చేస్తున్న ఆరోపణలు, బెదిరింపులపై భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. గతంలో ప్రపంచ ఇంధన మార్కెట్లను స్థిరీకరించేందుకు రష్యా నుంచి చమురు కొనమని అమెరికాయే తమను కోరిందని ఆయన గుర్తుచేశారు. ఇప్పుడు అదే విషయంలో బెదిరింపులకు పాల్పడటం తమను అయోమయానికి గురిచేస్తోందని జైశంకర్ తన మాస్కో పర్యటన సందర్భంగా వ్యాఖ్యానించారు.
మరోవైపు, చైనాతో భారత్ స్నేహం పెంచుకోవడంపై కూడా నవారో అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే, రష్యా నుంచి అత్యధికంగా చమురు కొనుగోలు చేస్తున్న చైనాపై అమెరికా ఇలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. మొత్తం మీద, రష్యా చమురు కొనుగోలు వ్యవహారం భారత్-అమెరికా సంబంధాలలో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ఒకవైపు అమెరికా నుంచి ఒత్తిడి, మరోవైపు రష్యాతో దీర్ఘకాల స్నేహం, చైనాతో సంబంధాల మెరుగుదల వంటి సవాళ్ల మధ్య భారత్ తన విదేశాంగ విధానాన్ని జాగ్రత్తగా ముందుకు తీసుకెళ్తోంది