AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి తెలంగాణ హైకోర్టు నోటీసులు..

మాజీ మంత్రి, బీఆర్ఎస్ నాయకురాలు సబితా ఇంద్రారెడ్డికి తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఓబుళాపురం అక్రమ మైనింగ్ కేసులో సబితా ఇంద్రారెడ్డితో పాటు మాజీ ఐఏఎస్ కృపానందానికి కూడా నోటీసులు జారీ అయ్యాయి. వీరిద్దరిని నిర్దోషులుగా తేల్చుస్తూ నాంపల్లి సీబీఐ కోర్టు గతంలో తీర్పు వెలువరించింది.

 

సీబీఐ ఈ తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ క్రమంలో ఉన్నత న్యాయస్థానం కౌంటర్ దాఖలు చేయాలని వీరిద్దరిని ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను వచ్చే నెలకు వాయిదా వేసింది.

 

ఓబుళాపురం మైనింగ్ కేసులో నాంపల్లి సీబీఐ కోర్టు మే నెలలో తుది తీర్పును వెలువరించింది. 15 ఏళ్ల పాటు సుదీర్ఘ విచారణ అనంతరం ఈ కేసులో మొత్తం ఐదుగురిని దోషులుగా, ఇద్దరిని నిర్దోషులుగా ప్రకటించింది. ఈ కేసులో ప్రధాన నిందితులైన గాలి జనార్ధన్ రెడ్డి, బీవీ శ్రీనివాస్ రెడ్డి, మెఫజ్ అలీఖాన్, గనుల శాఖ అప్పటి డైరెక్టర్ వీడీ రాజగోపాల్‌ను దోషులుగా నిర్దారిస్తూ శిక్షలు ఖరారు చేసింది.

 

గాలి జనార్ధన్ రెడ్డి సహా నలుగురికి ఏడేళ్ల జైలు శిక్షను ఖరారు చేసింది. దోషులకు రూ. 10 వేల చొప్పున జరిమానా కూడా విధించింది. అలాగే ఓబుళాపురం మైనింగ్ కంపెనీకి రూ. 2 లక్షల జరిమానా విధించింది. ఈ కేసులో, అప్పటి గనుల శాఖ మంత్రిగా ఉన్న సబితా ఇంద్రా రెడ్డికి, నాటి పరిశ్రమల శాఖ కార్యదర్శి కృపానందకు సీబీఐ కోర్టులో ఊరట లభించింది. వారిని నిర్దోషులుగా ప్రకటించడంతో సీబీఐ హైకోర్టుకు వెళ్లింది.

ANN TOP 10