AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఆసియా కప్ కోసం పాత జట్టుతోనే బరిలోకి భారత్..! గిల్ కి నో ఛాన్స్..?..

అంతర్జాతీయ క్రికెట్‌లో పరుగుల వరద పారిస్తున్న భారత యువ సంచలనం, కొత్త టెస్ట్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌తో పాటు యశస్వి జైస్వాల్‌లకు రాబోయే ఆసియా కప్‌లో చోటు దక్కడం అనుమానంగానే కనిపిస్తోంది. ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో అద్భుత ప్రదర్శన చేసినప్పటికీ, ఈ ఇద్దరు ఆటగాళ్లను పక్కన పెట్టేందుకే జట్టు యాజమాన్యం మొగ్గు చూపుతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. మంగళవారం ప్రకటించనున్న ఆసియా కప్ జట్టులో అనూహ్య మార్పులు చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

 

ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ పర్యవేక్షణలో భారత జట్టు టీ20 ఫార్మాట్‌లో అద్భుత విజయాలు సాధిస్తోంది. గంభీర్ కోచింగ్‌లో ఆడిన 15 టీ20 మ్యాచ్‌లలో 13 గెలిచిన నేపథ్యంలో విజయవంతమైన జట్టు కూర్పును మార్చేందుకు యాజమాన్యం ఇష్టపడటం లేదని తెలుస్తోంది. ఇదే కారణంతో ఫామ్‌లో ఉన్నప్పటికీ గిల్, జైస్వాల్‌లను పక్కన పెట్టి, పాత జట్టుతోనే బరిలోకి దిగాలని భావిస్తున్నట్లు స్పోర్ట్స్‌స్టార్ నివేదిక పేర్కొంది.

 

శుభ్‌మన్ గిల్ ప్రస్తుతం తన కెరీర్‌లోనే అత్యుత్తమ ఫామ్‌లో ఉన్నాడు. ఇంగ్లండ్‌తో ఇటీవల ముగిసిన టెస్ట్ సిరీస్‌లో 75.40 సగటుతో ఏకంగా 754 పరుగులు సాధించాడు. ఇందులో నాలుగు శతకాలు ఉండగా, అత్యధిక స్కోరు 269. ఈ ప్రదర్శనతోనే జులై నెలకు గాను ‘ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్’ అవార్డును కూడా గెలుచుకున్నాడు. ఈ ఏడాది అన్ని ఫార్మాట్లలో కలిపి 20 ఇన్నింగ్స్‌లలో 1234 పరుగులు చేసి, ప్రపంచంలోనే రెండో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్‌గా నిలిచాడు.

 

సెప్టెంబర్ 9 నుంచి 28 వరకు యూఏఈలో జరగనున్న ఆసియా కప్ కోసం అక్కడి నెమ్మదైన పిచ్‌లపై రాణించగల అనుభవజ్ఞుడైన మిడిల్ ఆర్డర్ బ్యాటర్ కోసం యాజమాన్యం అన్వేషిస్తోంది. ఈ నేపథ్యంలో శ్రేయస్ అయ్యర్, జితేశ్ శర్మలకు జట్టులో చోటు కల్పించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. మొత్తం మీద ఫామ్ కంటే అనుభవానికే ప్రాధాన్యత ఇస్తూ జట్టును ఎంపిక చేయాలని సెలక్టర్లు భావిస్తున్నట్లు సమాచారం.

ANN TOP 10