హిమాలయ పర్వత శిఖరాలు జాతీయ జెండాలోని మూడు రంగులతో నిండిపోయాయి. 14,000 అడుగుల ఎత్తులో సైనికులు, స్థానిక గిరిజనులు కలిసి 100 మీటర్ల పొడవైన జాతీయ పతాకాన్ని చేతబూని కదం తొక్కారు. 79వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ జిల్లా చునా సరిహద్దు ప్రాంతంలో ఈ అద్భుతమైన, అపూర్వమైన దృశ్యం ఆవిష్కృతమైంది.
భారత సైన్యానికి చెందిన గజరాజ్ కార్ప్స్ ఈ తిరంగా యాత్రకు నేతృత్వం వహించింది. ఈ యాత్రలో 160 మంది గోర్ఖా సైనికులు, 25 మంది ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ) సిబ్బందితో పాటు మాగో, చునా వంటి మారుమూల పల్లెల నుంచి సుమారు 150 మంది గ్రామస్థులు పాల్గొన్నారు. పసిపిల్లల నుంచి పెద్దల వరకు అందరూ భుజం భుజం కలిపి నడవడంతో ఆ ప్రాంతమంతా కాషాయం, తెలుపు, ఆకుపచ్చ వర్ణాలతో నిండిపోయింది. అసిస్టెంట్ కమిషనర్ థుటన్ వాంగ్చు నేతృత్వంలోని సివిల్ అడ్మినిస్ట్రేషన్ ఈ కార్యక్రమంలో గ్రామస్థులను భాగస్వాములను చేసింది. ఈ యాత్రలో వారణాసిలోని సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ టిబెటన్ స్టడీస్‌కు చెందిన 23 మంది విద్యార్థులు, ఒక ఉపాధ్యాయుడు కూడా పాల్గొనడం విశేషం.
ఈ భారీ ప్రదర్శన అనంతరం దేశభక్తితో పాటు పర్యావరణ పరిరక్షణ బాధ్యతను కూడా ప్రదర్శించారు. యాత్రలో పాల్గొన్న సైనిక, పౌర విభాగాలు, గ్రామస్థులు కలిసి ‘ప్లాస్టిక్ రహిత జోన్’ పేరుతో పరిశుభ్రతా కార్యక్రమం చేపట్టారు. ఆ ప్రాంతంలోని వ్యర్థాలను తొలగించి, సున్నితమైన హిమాలయ పర్యావరణ వ్యవస్థను కాపాడుకోవాల్సిన ఆవశ్యకతను చాటిచెప్పారు.
ఈ కార్యక్రమంపై అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండూ హర్షం వ్యక్తం చేశారు. “శిఖరాగ్ర ప్రాంతాల్లో ఇదే నిజమైన భారత స్ఫూర్తి” అని ఆయన ప్రశంసించారు. ఈ సందర్భంగా మాగో, చునా గ్రామాల్లోని ప్రతి ఇంటిపైనా జాతీయ జెండాను ఎగురవేసి స్థానికులు తమ దేశభక్తిని చాటుకున్నారు. స్వాతంత్ర్యం అనేది అందరి సమష్టి బాధ్యత అని ఈ కార్యక్రమం మరోసారి గుర్తు చేసింది.