AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

అమెరికాతో భగ్గుమంటున్న వాణిజ్య వివాదాలు..! మరోసారి ట్రంప్‌తో మోదీ కీలక భేటీ..?

భారత్, అమెరికా మధ్య వాణిజ్య సంబంధాలు తీవ్ర ఉద్రిక్తంగా మారిన వేళ, ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య కీలక సమావేశానికి రంగం సిద్ధమవుతోంది. వచ్చే నెల (సెప్టెంబర్)లో న్యూయార్క్‌లో జరిగే ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభకు ప్రధాని మోదీ హాజరుకానున్నారు. ఈ పర్యటన సందర్భంగా ట్రంప్‌తో ప్రత్యేకంగా భేటీ అయి, ఇరు దేశాల మధ్య నెలకొన్న వాణిజ్యపరమైన సమస్యలపై చర్చించేందుకు ప్రణాళికలు జరుగుతున్నాయని అధికార వర్గాల సమాచారం.

 

గతంలో మోదీ, ట్రంప్ మధ్య మంచి స్నేహబంధం ఉన్నప్పటికీ, ఇటీవల ట్రంప్ తీసుకున్న కఠిన నిర్ణయాలతో సంబంధాలు కాస్త దెబ్బతిన్నాయి. భారత ఉత్పత్తులపై అమెరికా ఏకంగా 50 శాతం భారీ సుంకాలను (టారిఫ్‌లు) విధించడమే దీనికి ప్రధాన కారణం. వాణిజ్యపరమైన కారణాలతో 25 శాతం, రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలును కొనసాగిస్తున్నందుకు మరో 25 శాతం కలిపి ఈ సుంకాలను విధించారు. ఇందులో మొదటి విడత సుంకాలు ఈ నెల‌ 7 నుంచి అమల్లోకి రాగా, మిగిలినవి ఆగస్టు 27 నుంచి వర్తింపజేయనున్నారు. ఈ గడువు సమీపిస్తుండటంతో, ఇరు దేశాల అధికారులు వాణిజ్య ఒప్పందంపై ముమ్మరంగా చర్చలు జరుపుతున్నారు.

భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందానికి రెండు అంశాలు ప్రధాన అడ్డంకిగా మారాయి. తమ వ్యవసాయ, పాడి ఉత్పత్తులకు భారత మార్కెట్లను పూర్తిగా తెరవాలన్న అమెరికా డిమాండ్‌కు భారత్ సుముఖంగా లేదు. దీంతో ఒప్పందంపై ప్రతిష్టంభన కొనసాగుతోంది. మరోవైపు, ఉక్రెయిన్‌తో మూడేళ్లుగా యుద్ధం చేస్తున్న రష్యాకు ఆర్థికంగా మేలు చేకూర్చేలా భారత్ చమురు కొనుగోలు చేస్తోందని అమెరికా ఆరోపిస్తోంది. ఈ కొనుగోళ్లను తక్షణమే తగ్గించుకోవాలని తీవ్ర ఒత్తిడి తెస్తోంది.

 

ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 23 నుంచి ప్రారంభమయ్యే ఐరాస సమావేశాల సందర్భంగా జరిగే మోదీ పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది. ఈ పర్యటనలో ప్రధాని మోదీ, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో పాటు ఇతర ప్రపంచ నేతలతో కూడా సమావేశమయ్యే అవకాశం ఉంది. ఆగస్టు 15న ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్ మధ్య జరగనున్న సమావేశాన్ని కూడా భారత్ నిశితంగా గమనిస్తోంది. వాణిజ్య చర్చల ఫలితాలు, అంతర్జాతీయ పరిణామాలపైనే మోదీ-ట్రంప్ భేటీ విజయం ఆధారపడి ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

ANN TOP 10