AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

చేనేత కళాకారుల ఆదాయం రెట్టింపు చేస్తా: మంత్రి నారా లోకేశ్..

చేనేత కార్మికులను కేవలం కార్మికులుగా కాకుండా, అద్భుతమైన డిజైన్లు సృష్టించే కళాకారులుగా గౌరవిస్తానని, వారి ఆదాయాన్ని రెట్టింపు చేయడమే తన లక్ష్యమని ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. మంగళగిరిలో జాతీయ చేనేత దినోత్సవం జరుపుకోవడం తన అదృష్టమని ఆయన పేర్కొన్నారు. గురువారం నాడు మంగళగిరి ఆటోనగర్‌లోని వీవర్ శాల వద్ద నిర్వహించిన 11వ జాతీయ చేనేత దినోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన చేనేత ఉత్పత్తుల స్టాళ్లను, మగ్గాలను పరిశీలించారు.

 

ఈ కార్యక్రమంలో లోకేశ్ మాట్లాడుతూ, “దారానికి రంగు వేయడం నుంచి చీర నేసే వరకు నేతన్నలు పడే కష్టం నేను ప్రత్యక్షంగా చూశాను. అందుకే వారిని చేనేత కళాకారులుగా పిలుస్తున్నాను” అని అన్నారు. 2019 ఎన్నికల్లో ఓటమి చెందినప్పటికీ, మంగళగిరి ప్రజలు తనను సొంత కుటుంబ సభ్యుడిలా ఆదరించారని గుర్తుచేసుకున్నారు. ఆ ఓటమి తనలో కసి పెంచిందని, ఐదేళ్లు ప్రజలకు అండగా నియోజకవర్గంలోనే పనిచేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.

 

ప్రతిపక్షంలో ఉన్నప్పుడే చేనేతలను ప్రోత్సహించడానికి 873 రాట్నాలను ఉచితంగా అందించామని, కరోనా కష్టకాలంలోనూ అండగా నిలిచామని లోకేశ్ వివరించారు. వీవర్ శాల ఏర్పాటు, టాటా తనేరా సంస్థతో ఒప్పందం వంటి చర్యల ద్వారా ఇప్పటికే చేనేతల ఆదాయం 30 శాతం పెరిగిందని, అయితే వారి ఆదాయం రెట్టింపు అయ్యేవరకు తాను సంతృప్తి చెందనని అన్నారు. స్వర్ణకారుల సంక్షేమం కోసం కూడా ప్రత్యేక సంఘం ఏర్పాటుచేసి ఆరోగ్య బీమా, ఆర్థికసాయం అందించినట్లు తెలిపారు.

 

యువగళం పాదయాత్రలో చేనేతలను దత్తత తీసుకుంటానని చెప్పిన మాటను కొందరు ఎగతాళి చేశారని, కానీ చేనేత రంగాన్ని ప్రోత్సహించాలనే లక్ష్యంతోనే ఆ నిర్ణయం తీసుకున్నానని లోకేశ్ ఉద్ఘాటించారు. తన కుటుంబం మంగళగిరి చేనేత వస్త్రాలనే వినియోగిస్తుందని, జాతీయ నేతలను కలిసినప్పుడు మంగళగిరి శాలువాలనే బహూకరిస్తానని చెప్పారు.

 

యువగళంలో చేనేతలకు ఇచ్చిన హామీలైన త్రిఫ్ట్ ఫండ్ పునరుద్ధరణ, చేనేత భరోసా కింద రూ.25వేల ఆర్థిక సాయం, స్వర్ణకారులకు కార్పొరేషన్ ఏర్పాటు వంటి హామీలను సీఎం చంద్రబాబు సహకారంతో నెరవేర్చామని లోకేశ్ ప్రకటించారు.

 

ముఖ్యమంత్రి సహకారంతో మంగళగిరి నియోజకవర్గంలో సుమారు 200 అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని లోకేష్ వివరించారు. 31 కమ్యూనిటీ హాళ్లు, మోడల్ లైబ్రరీ, నాలుగు లేన్ల రహదారి, 100 పడకల ఆసుపత్రి, భూగర్భ డ్రైనేజ్, జెమ్స్ అండ్ జ్యూయలరీ పార్క్, ఎయిమ్స్ అభివృద్ధి వంటి పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. పద్మశాలీ సామాజిక వర్గానికి చెందిన నందం అబద్దయ్య, తమ్మిశెట్టి జానకమ్మ, చిల్లపల్లి శ్రీనివాసరావు వంటి వారికి రాష్ట్రస్థాయి పదవులు ఇచ్చి తగిన గుర్తింపు కల్పించామని పేర్కొన్నారు.

 

ఈ కార్యక్రమంలో మంత్రి ఎస్. సవిత, సుచిత్ర ఎల్లా, పంచుమర్తి అనూరాధ, తమ్మిశెట్టి జానకీదేవి, పోతినేని శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

ANN TOP 10