ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కేరళలోని శ్రీ పద్మనాభస్వామి ఆలయంలో అత్యంత రహస్యమైన ‘బి-నేలమాళిగ’ తెరిచే అంశం మరోసారి తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దాదాపు ఐదేళ్ల విరామం తర్వాత తెరపైకి వచ్చిన ఈ వివాదంపై తుది నిర్ణయం తీసుకునే కీలక బాధ్యతను ఆలయ తంత్రికే (ప్రధాన పూజారి) అప్పగించారు. దీంతో ఈ మిస్టరీ వీడుతుందా లేదా అనే ఉత్కంఠ మళ్లీ మొదలైంది.
గురువారం తిరువనంతపురంలో ఆలయ పాలక మండలి, సలహా మండలి సంయుక్త సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి బి-నెలమాళిగ అంశాన్ని ప్రస్తావించారు. 2020లో సుప్రీంకోర్టు దీనిపై నిర్ణయం తీసుకునే అధికారాన్ని కమిటీల విచక్షణకే వదిలేసినా, ఇప్పటివరకు ఎలాంటి ముందడుగు పడలేదని ఆయన గుర్తుచేశారు. అయితే, ఈ కీలక సమావేశానికి ఆలయ తంత్రి గైర్హాజరయ్యారు. ఈ నేపథ్యంలో, కమిటీలు ఈ సున్నితమైన విషయంపై తుది నిర్ణయాన్ని తంత్రికే వదిలేశాయి. భవిష్యత్తులో ఆయన తన నిర్ణయాన్ని తెలియజేయాల్సి ఉంటుంది.
శ్రీ పద్మనాభస్వామి ఆలయంలో మొత్తం ఆరు నేలమాళిగలు ఉండగా, వాటిలో అపారమైన బంగారం, వజ్రాలు, అమూల్యమైన కళాఖండాలు ఉన్నట్లు ప్రచారంలో ఉంది. ఇప్పటికే ఐదు నేలమాళిగలను తెరిచారు. కానీ, ఆధ్యాత్మిక కారణాలు, నిర్మాణపరమైన ఆందోళనల కారణంగా బి-నేలమాళిగను మాత్రం ఇప్పటివరకు తెరవలేదు. దీని చుట్టూ అనేక రహస్యాలు, పురాణగాథలు ప్రచారంలో ఉన్నాయి.
గతంలో సుప్రీంకోర్టు నియమించిన మాజీ కాగ్ వినోద్ రాయ్ తన నివేదికలో బి-నేలమాళిగను ఇదివరకే రెండుసార్లు తెరిచారని పేర్కొన్నట్లు వచ్చిన వార్తలు పెనుదుమారం రేపాయి. అయితే, ఒకప్పుడు ఆలయ నిర్వాహకులుగా ఉన్న ట్రావెన్కోర్ రాజకుటుంబం ఈ వాదనను తీవ్రంగా ఖండించింది. బి-నేలమాళిగ ఎన్నడూ తెరవలేదని, దాని పవిత్రతను కాపాడాలని వారు గట్టిగా చెబుతున్నారు. ఆలయ నిర్వహణలో ఆర్థిక అవకతవకలు జరుగుతున్నాయని భక్తులు ఆరోపించడంతో 2011లో సుప్రీంకోర్టు ఈ వ్యవహారంలో జోక్యం చేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు అందరి దృష్టి ఆలయ తంత్రి తీసుకోబోయే నిర్ణయంపైనే నిలిచింది.