ప్రపంచవ్యాప్తంగా ఉన్న వలసదారుల్లో అత్యధికం భారతీయులే అని ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. 2024 నాటికి వరల్డ్‌వైడ్‌గా 1.85 కోట్ల మంది ప్రవాస భారతీయులు ఉన్నట్టు, ఇది ప్రపంచ వలసదారుల్లో 6 శాతం అని పేర్కొంది. ఇక, ప్రపంచవ్యాప్తంగా 30.4 కోట్ల మంది అంతర్జాతీయ వలసదారులు ఉన్నారని తెలిపింది. 2020లో ఈ సంఖ్య 27.5 కోట్లుగా ఉన్నట్లు వెల్లడించింది.
అంతర్జాతీయ వలసల్లో 1.85 కోట్ల మంది ప్రవాసులతో భారత్ అగ్రస్థానంలో ఉంటే.. ఆ తర్వాత చైనా (1.17 కోట్లు), మెక్సికో (1.16 కోట్లు), ఉక్రెయిన్ (98 లక్షలు), రష్యా (91 లక్షలు) ఉన్నాయి.
అత్యధిక భారతీయ డయాస్పోరా ఉన్న దేశాలు
ఒకప్పుడు సౌదీ అరేబియా, పాకిస్థాన్ దేశాలకే పరిమితమైన భారతీయ వలస సముదాయం ఇప్పుడు పశ్చిమ దేశాలకు బదిలీ అయింది. పశ్చిమాసియాలోని ఇండియన్ డయాస్పొరాను తీసుకుంటే యూఏఈలోని మొత్తం జనాభాలో 40 శాతం భారతీయ వలసదారులే ఉన్నారు. ఇక, అమెరికాలో ఇండో అమెరికన్లు రెండో అతిపెద్ద ఆసియన్ గ్రూప్‌గా ఉన్నారు. మొదటి స్థానంలో చైనీస్ అమెరికన్లు ఉన్నారు.
యూఏఈలో 32.5 లక్షల మంది భారతీయులు ఉంటే.. అమెరికాలో 31.7లక్షలు, సౌదీ అరేబియాలో 19.5 లక్షలు, కెనడాలో 10.2 లక్షల మంది ఉన్నారు.
అలాగే ఐక్యరాజ్యసమితి డేటా ప్రకారం, పెద్ద సంఖ్యలో భారతీయ వలసదారులకు ఆతిథ్యం ఇస్తున్న ఇతర దేశాలలో ఆస్ట్రేలియా, కువైట్, ఒమన్, పాకిస్థాన్, ఖతార్, బహ్రెయిన్, మలేషియా, యూకే ఉన్నాయి.