ఏపీలో జరిగిన లిక్కర్ స్కాం సాధారణమైనది కాదని, వేల కోట్ల కుంభకోణం జరిగిందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. ఈ వ్యవహారం ఏ స్థాయి వరకు వెళుతుందో తనకు తెలియదని అన్నారు. ఈ కేసులో జగన్ అరెస్ట్ పై కేంద్రం అనుమతి కావాలా? అనే విషయంపై తాను ఇప్పుడే ఏమీ చెప్పలేనని తెలిపారు. ఓ తెలుగు న్యూస్ ఛానల్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పవన్ ఈ వ్యాఖ్యలు చేశారు.
లిక్కర్ స్కాం అనేది కల్పిత కథ కాదని, మద్య నిషేధం చేస్తామని చెప్పి వేల కోట్ల వ్యాపారం చేశారని ఆరోపించారు. ఇష్టం వచ్చిన కంపెనీలకు అనుమతులు ఇచ్చారని, పైగా కల్తీ మద్యం అమ్మారని మండిపడ్డారు. ఎంతోమంది చనిపోయారు, ఎంతోమంది నరాల జబ్బులతో బాధపడుతున్నారు… ఇవన్నీ కూడా లిక్కర్ స్కాంకు సాక్ష్యాధారాలే అని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.
వైసీపీ నేతలు రప్పా రప్పా నరికేస్తాం, చంపేస్తాం అంటున్నారని… మధ్యయుగం నాటి మాటలు ఇప్పుడు మాట్లాడితే శిక్ష తప్పదని హెచ్చరించారు. అయినా, జగన్ మళ్లీ గెలిస్తే ఏం చేస్తాడని పవన్ ప్రశ్నించారు.