AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

రాజ్యసభలో టీడీపీ ఎంపీ సానా సతీష్ బాబు ప్రశ్నలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమాధానం..

గత ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్‌లో డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్ (డీఎంఎఫ్) కింద సేకరించిన నిధులు, వాటి వినియోగంపై కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి రాజ్యసభలో వివరాలు వెల్లడించారు. టీడీపీ రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బాబు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ, ముఖ్యంగా కాకినాడ జిల్లాలో డీఎంఎఫ్ నిధుల వినియోగం, ఖనిజాల వెలికితీత ద్వారా వచ్చిన ఆదాయంపై సమాచారం ఇచ్చారు. నేడు పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన సంగతి తెలిసిందే.

 

గత ఐదు సంవత్సరాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డీఎంఫ్ కింద సేకరించిన మొత్తం నిధులను, జిల్లాల వారీగా వివరాలు తెలియజేయాలని రాజ్యసభ ఎంపీ సానా సతీష్ బాబు అడిగారు. ముఖ్యంగా, కాకినాడలో వెలికితీసిన ఖనిజాల జాబితా మరియు వాటి నుండి వచ్చిన ఆదాయం, అలాగే డీఎంఫ్ నిధులను ఉపయోగించి అధిక ప్రాధాన్యత మరియు ఇతర ప్రాధాన్యతా రంగాలలో పూర్తయిన, కొనసాగుతున్న మరియు పెండింగ్ ప్రాజెక్టుల వివరాలను కూడా అందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ నేపథ్యంలో, కిషన్ రెడ్డి కాకినాడ జిల్లాలో డీఎంఎఫ్ కింద మంజూరైన ప్రాజెక్టుల వివరాలను అందించారు.

 

కాకినాడలో డీఎంఎఫ్ ప్రాజెక్టుల పురోగతి:

అధిక ప్రాధాన్యత ప్రాజెక్టులు: కాకినాడకు అధిక ప్రాధాన్యత కింద 125 ప్రాజెక్టులు మంజూరు కాగా, అందులో 59 పూర్తయ్యాయి. 9 ప్రాజెక్టులు రద్దయ్యాయి, మరియు 57 ప్రాజెక్టుల నిర్మాణాలు కొనసాగుతున్నాయి.

ఇతర ప్రాధాన్యత ప్రాజెక్టులు: ఇతర ప్రాధాన్యతా రంగాల కింద మంజూరైన 169 ప్రాజెక్టులలో 10 పూర్తయ్యాయి, 121 రద్దయ్యాయి. మిగిలిన వాటిపై స్పష్టమైన సమాచారం లేదు.

డీఎంఎఫ్ నిధుల కేటాయింపు – జిల్లాల వారీగా:

2024-25 ఆర్థిక సంవత్సరంలో డీఎంఫ్ నిధుల కేటాయింపులో నంద్యాల, కడప జిల్లాలు ముందున్నాయి. నంద్యాల జిల్లాకు అత్యధికంగా రూ.18.46 కోట్లు కేటాయించారు. ఆ తర్వాత కడప జిల్లాకు రూ.15.17 కోట్లు కేటాయించారు.అతి తక్కువ నిధులు పొందిన జిల్లాలలో కృష్ణా, అల్లూరి సీతారామరాజు, మరియు విశాఖపట్నం ఉన్నాయి.

 

కాకినాడ జిల్లాలో ఖనిజ ఆదాయం:

కాకినాడ జిల్లాలో ఖనిజాల వెలికితీత మరియు తద్వారా లభించిన ఆదాయం వివరాలను కూడా కిషన్ రెడ్డి వెల్లడించారు. కాకినాడలో వెలికితీసిన లేటరైట్ ఖనిజం ద్వారా రూ.36.86 కోట్ల ఆదాయం లభించిందని తన సమాధానంలో పేర్కొన్నారు.

ANN TOP 10