అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా కొత్త రకం విమానాన్ని అభివృద్ధి చేస్తోంది. దీని పేరు ఎక్స్-59. ఈ సూపర్‌సోనిక్ జెట్, శబ్ద వేగాన్ని మించి ప్రయాణించే సామర్థ్యం కలిగిన ఒక వినూత్న విమానం. ప్రస్తుతం కాలిఫోర్నియాలోని లాక్‌హీడ్ మార్టిన్ స్కంక్ వర్క్స్ ఫెసిలిటీ పెయింట్ బార్న్ లో తుదిమెరుగులు దిద్దుతున్నారు. సాధారణ సూపర్‌సోనిక్ విమానాలు ఉత్పత్తి చేసే బిగ్గరగా ఉండే సోనిక్ బూమ్‌ను ‘సోనిక్ థంప్’గా తగ్గించేలా ఇందులో వినూత్న సాంకేతిక పరిజ్ఞాన వినియోగిస్తున్నారు. ఇది సూపర్ సోనిక్ వేగంతో కమర్షియల్ ప్రయాణాన్ని మరింత సాధ్యం చేస్తుంది.
నాసా బ్లాగ్ పోస్ట్ ప్రకారం, ఈ ఎక్స్-59 విమానం గంటకు 1,535 నుండి 3,045 మైళ్ల వేగంతో (మాక్ 2 నుంచి మాక్ 4) ప్రయాణించగలదని అంచనా. ప్రస్తుత వాణిజ్య విమానాలు గంటకు సుమారు 600 మైళ్ల వేగంతో ప్రయాణిస్తాయి. ఈ కొత్త విమానం న్యూయార్క్ నుంచి లండన్ వంటి అంతర్జాతీయ మార్గాలలో ప్రయాణ సమయాన్ని సగానికి తగ్గించగల సామర్థ్యం కలిగి ఉంది. సాధారణంగా న్యూయార్క్ నుంచి లండన్ కు 7 గంటలు పడితే, ఈ విమానం మూడున్నర గంటల్లోనే ఈ ప్రయాణాన్ని పూర్తి చేయగలదు.
“ఈ దశకు చేరుకోవడం మా బృందానికి ఎంతో ఉత్సాహాన్ని కలిగిస్తోంది. ఎక్స్-59 పెయింట్ బార్న్ నుండి బయటకు వచ్చినప్పుడు, దాని కొత్త రూపంతో మా దృష్టి సాకారమవుతుందని నేను ఆశిస్తున్నాను” అని నాసా లో-బూమ్ ఫ్లైట్ డెమాన్‌స్ట్రేటర్ ప్రాజెక్ట్ మేనేజర్ కాథీ బామ్ అన్నారు.
ఈ విమానం రాబోయే సంవత్సరంలో మరిన్ని పరీక్షలను ఎదుర్కొననుంది, ఈ విమానం యొక్క ప్రత్యేక డిజైన్, దాని పొడవైన, సన్నని ముక్కు మరియు రెక్కలు, షాక్‌వేవ్‌లను విడదీసి, సోనిక్ బూమ్‌ను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఈ సాంకేతికత వాణిజ్య విమాన ప్రయాణంలో విప్లవాత్మక మార్పులను తీసుకురాగలదని, అంతర్జాతీయ నియమాలను సవరించడానికి దోహదపడగలదని నాసా ఆశిస్తోంది.