రేవంత్ రెడ్డి పీసీసీ పదవిని కొనుక్కున్నారని స్వయంగా కోమటిరెడ్డి సోదరులే ఆరోపించారని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి విమర్శించారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మాటలను ప్రజలు విశ్వసించే పరిస్థితి లేదని అన్నారు. వారి వ్యాఖ్యలన్నీ బ్లాక్మెయిల్ స్టేట్మెంట్లేనని ఆయన అభివర్ణించారు.
వారు ఒక ప్రకటన చేసి వెంటనే రాజీ పడతారని ఆయన వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి పదవిని కొనుక్కున్నారని చెప్పడమే కాకుండా, ఆయన నాయకత్వంలో పనిచేయబోమని రాజగోపాల్ రెడ్డి అన్నారని గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి వద్దని చెప్పి పార్టీ వీడిన రాజగోపాల్ రెడ్డి తిరిగి అదే పార్టీలో కొనసాగుతున్నారని ఆయన అన్నారు. రాజగోపాల్ రెడ్డి మాటలను నమ్మేవారు అమాయకులే అవుతారని ఆయన పేర్కొన్నారు.