రాష్ట్రంలో నిర్వహించనున్న కులగణన కేవలం డేటా సేకరణ మాత్రమే కాదని, ఇది తెలంగాణ రాష్ట్ర మెగా హెల్త్ చెకప్ కు ఉపయోగపడుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. బీసీల అభ్యున్నతికి, సామాజిక న్యాయం అమలుకు కులగణన ఎంతగానో తోడ్పడుతుందని ఆయన పేర్కొన్నారు. కులగణనపై సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ సుదర్శన్ రెడ్డి నేతృత్వంలోని నిపుణుల కమిటీ ఎంసీహెచ్ఆర్డీలో ముఖ్యమంత్రితో సమావేశమైంది.
కమిటీ 300 పేజీల నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. కమిటీ చేసిన సూచనలపై మంత్రివర్గంలో చర్చించి ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, వెనుకబాటుతనంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల మధ్య ఉన్న వ్యత్యాసాలు, వాటికి గల కారణాలను అధ్యయనం చేయాలని సూచించారు. అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో నిర్వహించిన ఈ సర్వే చారిత్రాత్మకమైనదని ఆయన అన్నారు. ఇది దేశానికే రోల్ మోడల్‌గా నిలుస్తుందని నిపుణుల కమిటీ అభిప్రాయపడింది.