అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్)లో భారత వ్యోమగామి శుభాంశు శుక్లా సరికొత్త ప్రయోగాలతో ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఆయన తాజాగా రైతు అవతారమెత్తి అంతరిక్షంలో మనందరికీ సుపరిచితమైన మెంతి, పెసర పంటలను పండిస్తున్నారు. గురుత్వాకర్షణ శక్తి లేని (జీరో గ్రావిటీ) వాతావరణంలో ఈ మొక్కల పెరుగుదల ఎలా ఉంటుందోనని ఆయన అధ్యయనం చేస్తున్నారు.
ఈ ప్రయోగంలో భాగంగా, శుభాంశు శుక్లా గాజు పాత్రలలో మెంతి, పెసర విత్తనాలను నాటారు. ఐఎస్‌ఎస్‌లోని ప్రత్యేక నిల్వ ఫ్రీజర్‌లో వాటిని ఉంచి అవి మొలకెత్తే విధానాన్ని ఫొటోలు తీశారు. ఈ పరిశోధనలో ధార్వాడ్ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చెందిన రవికుమార్ హోసమణి, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన సుధీర్ సిద్దపురెడ్డి అనే ఇద్దరు శాస్త్రవేత్తలు శుక్లాకు సహకరిస్తున్నారు. యాత్ర ముగించుకుని భూమికి తిరిగి వచ్చాక, ఈ మొలకలలోని జన్యు మార్పులు, పోషక విలువలను విశ్లేషించనున్నట్లు యాక్సియం స్పేస్ సంస్థ తెలియజేసింది.
వ్యవసాయ ప్రయోగాలతో పాటు శుభాంశు శుక్లా మరిన్ని కీలక పరిశోధనలు కూడా చేస్తున్నారు. జీరో గ్రావిటీలో ఆహారం, ఆక్సిజన్‌తో పాటు జీవ ఇంధనాలను ఉత్పత్తి చేసే సామర్థ్యంపై మైక్రోఆల్గేలను అధ్యయనం చేస్తున్నారు. అలాగే, మానవ మూలకణాలు (స్టెమ్ సెల్స్), వ్యోమగాముల మానసిక సామర్థ్యం, కండరాల పనితీరు వంటి అంశాలపైనా పరిశోధనలు కొనసాగిస్తున్నారు.
ఈ ప్రయోగాల గురించి శుక్లా మాట్లాడుతూ, “భూమిపై ఉన్న పరిశోధకులకు, అంతరిక్ష కేంద్రానికి మధ్య వారధిగా ఉంటూ ఈ పరిశోధనలు నిర్వహించడం గర్వంగా, ఆనందంగా ఉంది” అని పేర్కొన్నారు. యాక్సియం-4 ప్రైవేట్ స్పేస్ మిషన్‌లో భాగంగా శుభాంశు శుక్లా గత వారమే మరో ముగ్గురు వ్యోమగాములతో కలిసి ఐఎస్‌ఎస్‌కు చేరుకున్న విషయం తెలిసిందే.