పనితీరు మెరుగుపరుచుకోకపోతే పదవులు ఉండవంటూ తన కేబినెట్ సహచరులకు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర స్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు. ప్రతిపక్షాలు చేసే దుష్ప్రచారాన్ని సమర్థంగా తిప్పికొట్టడంలో విఫలమైతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని స్పష్టం చేశారు. అమరావతిలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఆయన మంత్రుల పనితీరుపై కీలక వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుత రాజకీయాలు కేవలం సబ్జెక్టు ఆధారంగా కాకుండా, ప్రచారాలపైనే ఎక్కువగా నడుస్తున్నాయని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో మంత్రులు అన్ని విషయాలపై సకాలంలో స్పందించాలని గట్టిగా సూచించారు. “విపక్షాల తప్పుడు ప్రచారాలను ఎప్పటికప్పుడే తిప్పికొట్టకపోతే ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుంది. మీరు సరిగా స్పందించకపోతే మీ స్థానంలో కొత్తవాళ్లు వస్తారు. ఇక మంత్రులు రోజులు లెక్కపెట్టుకోవాల్సి వస్తుంది” అని ఆయన హెచ్చరించారు.
వైసీపీ నాయకులు మహిళల పట్ల కూడా అసభ్యంగా మాట్లాడుతున్నారని, వారి నిజ స్వరూపాన్ని ప్రజల ముందు ఉంచాల్సిన బాధ్యత మంత్రులపై ఉందని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వానికి నష్టం కలిగించే ఏ చిన్న విషయాన్ని కూడా ఉపేక్షించవద్దని, ప్రజాక్షేత్రంలో వాస్తవాలను బలంగా వినిపించాలని ఆయన ఆదేశించారు.