తెలంగాణకు అవసరమైన యూరియా కోటాను పెంచాలన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తికి కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. రాష్ట్ర రైతాంగానికి ఎరువుల కొరత రాకుండా చూస్తామని హామీ ఇచ్చింది. అయితే, అదే సమయంలో రాష్ట్రంలో యూరియా వాడకం పెరగడంపై ఆందోళన వ్యక్తం చేసింది.
ఇటీవల ఢిల్లీ పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రులతో భేటీ అయి రాష్ట్రానికి యూరియా కోటాను పెంచాలని కోరారు. ఈ విజ్ఞప్తిపై స్పందించిన కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి జేపీ నడ్డా, రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా యూరియాను వెంటనే సరఫరా చేయాలని అధికారులను ఆదేశించారు. సరఫరా అయిన యూరియాను వ్యవసాయేతర పనులకు మళ్లించకుండా కఠిన చర్యలు తీసుకోవాలని, అన్ని జిల్లాలకు సక్రమంగా పంపిణీ జరిగేలా చూడాలని ఆయన స్పష్టం చేశారు.
అదే సమయంలో, తెలంగాణలో యూరియా వాడకం పెరగడంపై మంత్రి నడ్డా ఆందోళన వ్యక్తం చేశారు. 2024-25 యాసంగి సీజన్లో రాష్ట్రంలో యూరియా అమ్మకాలు ఏకంగా 21 శాతం పెరిగాయని ఆయన గుర్తు చేశారు. రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి, సేంద్రియ సాగును ప్రోత్సహించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని తెలిపారు. ‘ప్రణామ్’ పథకం కింద రాష్ట్రాలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు అందిస్తామని ఆయన వివరించారు.