అమెరికా ఖండంలోనే అత్యంత ప్రాచీన నాగరికతగా భావించే ‘కారల్’కు సంబంధించిన కీలక రహస్యాలను ఛేదించే దిశగా పురావస్తు శాస్త్రవేత్తలు భారీ ముందడుగు వేశారు. పెరూలో ‘పెనికో’ అనే ఓ పురాతన నగరాన్ని తాజాగా గుర్తించారు. ఆసియా, మధ్యప్రాచ్యంలో తొలి నాగరికతలు విలసిల్లిన కాలంలోనే ఈ నగరం కూడా ఉనికిలో ఉండి ఉండవచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. ఈ ఆవిష్కరణ అమెరికా చరిత్రపై కొత్త వెలుగును ప్రసరింపజేస్తోంది.
ఎనిమిదేళ్లుగా సాగిస్తున్న సుదీర్ఘ పరిశోధనల ఫలితంగా ఈ నగరం వెలుగు చూసింది. డ్రోన్ ఫుటేజ్ ఆధారంగా పరిశోధనలు చేయగా, నగరం మధ్యలో కొండపై ఒక వృత్తాకార నిర్మాణం, దాని చుట్టూ మట్టి, రాళ్లతో నిర్మించిన భవనాల అవశేషాలు కనిపించాయి. ఇప్పటివరకు మొత్తం 18 నిర్మాణాలు బయటపడ్డాయని, వీటిలో ప్రార్థనా మందిరాలు, నివాస గృహాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ నగరం ఒకప్పుడు పసిఫిక్ తీరం, అండీస్ పర్వతాలు, అమెజాన్ నదీ ప్రాంతాల మధ్య కీలక వాణిజ్య కేంద్రంగా పనిచేసి ఉంటుందని వారు అంచనా వేస్తున్నారు.
పరిశోధనల్లో భాగంగా ఇక్కడి కట్టడాల నుంచి ఉత్సవాలకు వాడిన వస్తువులు, మట్టితో చేసిన మనుషులు, జంతువుల బొమ్మలు, పూసలు, సముద్రపు గవ్వలతో రూపొందించిన ఆభరణాలను సేకరించారు. క్రీస్తు పూర్వం 3000 నాటి అత్యంత ప్రాచీన నగరమైన కారల్కు సమీపంలోనే పెనికో ఉండటం గమనార్హం. పిరమిడ్లు, అత్యాధునిక నీటిపారుదల వ్యవస్థలతో విలసిల్లిన కారల్ నాగరికత గురించి మరిన్ని వివరాలను పెనికో నగరం అందిస్తుందని పరిశోధకులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.