ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు శ్రీశైలం ప్రాజెక్టును సందర్శించనున్నారు. ఉదయం 10 గంటలకు నిర్వహించనున్న జల హారతి కార్యక్రమానికి చంద్రబాబు హాజరవుతారు. ఈ సందర్భంగా కృష్ణమ్మకు ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తి దిగువన ఉన్న నాగార్జునసాగర్‌కు నీటిని విడుదల చేసే కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొంటారు.
ఇప్పటికే ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా శ్రీశైలం ప్రాజెక్టుకు జూరాల, సుంకేసుల ప్రాజెక్టుల నుంచి భారీగా వరద నీరు చేరుతోంది. దీంతో శ్రీశైలం జలాశయం వరద జలాలతో నిండుకుండలా మారింది. జలాశయం పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 885 అడుగులు కాగా, ఇప్పటికే 880 అడుగులకు చేరింది. దీంతో అధికారికంగా గేట్లు ఎత్తేందుకు ప్రాజెక్టు అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు ఇప్పటికే ఏపీ జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుకు అధికారులు ఆహ్వానం పంపారు.
ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఈరోజు ఉదయం పది గంటలకు ఉండవల్లి హెలిప్యాడ్ నుంచి శ్రీశైలం బయలుదేరి 11 గంటలకు సుండిపెంట హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు. 11 గంటల నుంచి 11.35 గంటల మధ్య శ్రీశైలం భ్రమరాంబ సమేత శ్రీ మల్లికార్జునస్వామి వార్లను దర్శించుకోనున్నారు.
ఆ తర్వాత 11.50 గంటల నుంచి 12.10 గంటల వరకు శ్రీశైలం జలాశయం వద్ద జల హారతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. జల హారతి కార్యక్రమంలో భాగంగా గేట్లు ఎత్తిన తర్వాత కృష్ణమ్మకు చీర, సారెలు సమర్పిస్తారు. ఆ తర్వాత 12.25 గంటల నుంచి 1.10 గంటల వరకు నీటి వినియోగదారుల సంఘం నేతలతో సమావేశమవుతారు. అనంతరం 1.30 గంటలకు తిరిగి సుండిపెంట హెలిప్యాడ్ వద్దకు చేరుకుని అమరావతికి తిరుగు ప్రయాణం అవుతారు.