AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఆంధ్రప్రదేశ్‌లో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయి..ఏపీలో తక్షణమే రాష్ట్రపతి పాలన విధించాలి: జగన్ డిమాండ్..

ఆంధ్రప్రదేశ్‌లో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని, తక్షణమే రాష్ట్రపతి పాలన విధించాలని వైసీపీ అధినేత వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో రాజకీయ నాయకులకు, సాధారణ పౌరులకు రక్షణ కరువైందని, ఈ పరిస్థితుల్లో రాజ్యాంగాన్ని కాపాడలేని ప్రభుత్వానికి అధికారంలో ఉండే అర్హత లేదని ఆయన తీవ్రస్థాయిలో విమర్శించారు.

 

“ఏపీలో లా అండ్‌ ఆర్డర్‌ పూర్తిగా క్షీణించింది. రెడ్‌బుక్, పొలిటికల్‌ గవర్నన్స్‌లతో ఆంధ్రప్రదేశ్ రక్త‌మోడుతోంది. వైసీపీకి చెందిన నాయకులు, కార్యకర్తలపై ఒక పథకం ప్రకారం తప్పుడు కేసులు పెడుతూ అరెస్టులు చేయిస్తున్నారు. అదీ వీలుకాకపోతే, తమవాళ్లని ప్రోత్సహించి మరీ దాడులు చేయిస్తున్నారు. గుంటూరు జిల్లా మన్నవ గ్రామ దళిత సర్పంచి నాగమల్లేశ్వర్రావును పట్టపగలే కొట్టి చంపేప్రయత్నంచేశారు. దీనికి సంబంధించిన వైరల్‌ అయిన వీడియో రాష్ట్రంలో మాఫియా, దుర్మార్గపు పాలనను తెలియజేస్తోంది.

 

నాగమల్లేశ్వర్రావు కుటుంబం మొదటినుంచి వైసీపీలో ఉండడం, ప్రజల్లో వారికి మంచి గుర్తింపు ఉండడం టీడీపీ వారికి కంటగింపుగా మారింది. పలుమార్లు బెదిరించినా, భయపెట్టినా వెనకడుగు వేయకపోవడంతో, రాజకీయంగా అక్కడ, ఆ ప్రాంతంలో వైసీపీ ప్రాబల్యాన్ని తట్టుకోలేక స్థానిక ఎమ్మెల్యే తన కార్యకర్తలను పురిగొల్పి ఈ దాడులు చేయించారు. ఆ వీడియోలు చూస్తే, జరిగిన దాడి ఎంత అన్యాయమో, ఎంత హేయమో కనిపిస్తుంది.

 

చంద్రబాబు గారు స్వయంగా ప్రోత్సహిస్తూ, తన వాళ్లతో చేయిస్తున్న ఈ దారుణాలతో, వరుసగా జరుగుతున్న ఘటనల నేపథ్యంలో, రాష్ట్రంలో ఎవ్వరికీ రక్షణలేని పరిస్థితులు నెలకొన్నాయి. మాఫియా తరహాలో రాష్ట్రాన్ని నడుపుతున్న చంద్రబాబుకు అసలు పదవిలో ఉండే అర్హత ఉందా? రాజకీయ నాయకులకు, పౌరులకు రక్షణ లేని ఈ రాష్ట్రంలో, రాజ్యాంగాన్ని, చట్టాన్ని ఉల్లంఘిస్తూ, లా అండ్‌ ఆర్డర్‌ కాపాడలేని ప‌రిస్థితుల్లో రాష్ట్రపతి పాలన ఎందుకు పెట్టకూడదని ప్రశ్నిస్తున్నాను” అంటూ జగన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10