AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కర్ణాటకలోని విషాదకరమైన సంఘటన..! ఆవును చంపిందని పగ.. ఐదు పులుల ప్రాణాలు తీసిన విష ప్రయోగం..!

కర్ణాటకలోని ప్రసిద్ధ మలె మహదేశ్వర వన్యప్రాణి అభయారణ్యంలో అత్యంత విషాదకరమైన సంఘటన చోటుచేసుకుంది. ఒక తల్లి పులి, దాని నాలుగు పిల్లలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాయి. విష ప్రయోగం కారణంగానే ఇవి మరణించి ఉంటాయని అధికారులు అనుమానిస్తున్నారు. ఈ అమానవీయ ఘటనపై కర్ణాటక ప్రభుత్వం ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించింది.

 

చామరాజనగర్ జిల్లాలోని మలె మహదేశ్వర వన్యప్రాణి అభయారణ్యం పరిధిలోని హుగ్యం రేంజ్‌, మీన్యం అటవీ ప్రాంతంలో ఈ దారుణం గురువారం వెలుగు చూసింది. తొలుత తల్లి పులి, మూడు కూనలు చనిపోయినట్లు వార్తలు వచ్చినా, ఆ తర్వాత మొత్తం నాలుగు పిల్లలు సహా తల్లి పులి మరణించినట్లు అధికారులు తాజాగా ధ్రువీకరించారు.

 

ఈ ఘటనపై ప్రాథమిక విచారణ చేపట్టిన అధికారుల కథనం ప్రకారం అడవి సమీపంలో మేస్తున్న ఒక ఆవును ఈ పులి చంపి, దాని కళేబరాన్ని అడవిలోకి లాక్కెళ్లింది. ఆవు కళేబరాన్ని గమనించిన స్థానిక పశువుల కాపరులు, ప్రతీకారంతో దానిలో విషం కలిపి ఉండవచ్చని భావిస్తున్నారు. అనంతరం ఆ కళేబరాన్ని తినడానికి వచ్చిన తల్లి పులి, దాని పిల్లలు విష ప్రభావంతో మృత్యువాత పడి ఉంటాయని అంచనా వేస్తున్నారు.

 

ఈ ఘటనపై అటవీ, పోలీస్ శాఖ అధికారులు సంయుక్తంగా దర్యాప్తు ముమ్మరం చేశారు. పులి చంపిన ఆవు కళేబరాన్ని స్వాధీనం చేసుకున్న అధికారులు, దాని యజమానిని గుర్తించేందుకు శుక్రవారం గాలింపు చర్యలు ప్రారంభించారు. జాతీయ పులుల సంరక్షణ ప్రాధికార సంస్థ (ఎన్‌టీసీఏ) మార్గదర్శకాల ప్రకారం, పులి పిల్లలకు శుక్రవారం, తల్లి పులికి గురువారమే పోస్టుమార్టం పూర్తి చేశారు.

 

ఇది అత్యంత హేయమైన చర్య: విజయేంద్ర

ఈ ఘటనపై కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు బి.వై. విజయేంద్ర తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. “మహదేశ్వరుని వాహనంగా పులిని పూజించే పవిత్ర మలె మహదేశ్వర కొండల్లో ఒకేసారి ఐదు పులులు మరణించడం అత్యంత అమానుషం, దిగ్భ్రాంతికరం” అని ఆయన శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విష ప్రయోగమే ఈ మరణాలకు కారణమైతే, ఇది అత్యంత హేయమైన, ఖండించదగిన చర్య అని అన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన దర్యాప్తు బృందం నిజానిజాలను త్వరితగతిన నిగ్గు తేల్చి, నిందితులను కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. వన్యప్రాణుల సంరక్షణపై ప్రజల్లో మరింత అవగాహన పెంచాలని, అటవీ సరిహద్దు గ్రామాల ప్రజలకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

 

మూడు రోజుల్లో నివేదిక ఇవ్వాలి: మంత్రి ఈశ్వర్ ఖండ్రే

ఈ ఘటనపై కర్ణాటక అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రే గురువారం స్పందించారు. ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ (పీసీసీఎఫ్) ఆధ్వర్యంలో విచారణకు ఆదేశించామని, మూడు రోజుల్లోగా సమగ్ర నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించినట్టు తెలిపారు. దేశంలోనే పులుల సంఖ్యలో కర్ణాటక (563) రెండో స్థానంలో ఉందని, ఇలాంటి రాష్ట్రంలో ఈ ఘటన జరగడం చాలా బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు 906 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ అభయారణ్యం పులులు, ఏనుగులు, చిరుతపులులు వంటి అనేక వన్యప్రాణులకు నిలయం.

ANN TOP 10