కూటమి ప్రభుత్వం ఏర్పడి విజయవంతంగా ఏడాది పాలన పూర్తి చేసుకుందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తెలిపారు. రాష్ట్ర శ్రేయస్సే తన ప్రథమ ప్రాధాన్యమని, 2019లో అధికారంలోకి వచ్చిన గత ప్రభుత్వం విధ్వంసకర పాలన సాగించిందని ఆయన విమర్శించారు. కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన ‘సుపరిపాలనలో తొలి అడుగు’ అనే కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు.
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రజలు అనేక కష్టనష్టాలకు గురయ్యారని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆ సమయంలో అధికారులు కూడా భయంతో విధులు నిర్వర్తించాల్సి వచ్చిందని, చివరికి నాటి ప్రతిపక్ష నేత చంద్రబాబుని సైతం పలు రకాలుగా వేధించారని ఆయన గుర్తుచేశారు. “వైసీపీ పాలన చూసిన తర్వాత, ఆంధ్రప్రదేశ్‌కు అసలు భవిష్యత్తు ఉంటుందా అనే సందేహం కలిగింది. ఒకవేళ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకపోయి ఉంటే రాష్ట్ర పరిస్థితి ఏమై ఉండేదో ఊహించడానికే భయంగా ఉంది. మాతో పాటు మా కుటుంబ సభ్యులను కూడా తీవ్ర ఇబ్బందులకు గురిచేశారు” అని పవన్ కల్యాణ్ అన్నారు.
ప్రజలకు సుపరిపాలన అందించాలనే ఏకైక లక్ష్యంతో తామందరం కూటమిగా ఏర్పడి ముందుకు వచ్చామని ఆయన స్పష్టం చేశారు. తమ పోరాటాన్ని ప్రజలు గుర్తించి, ఎన్నికల్లో అఖండ మెజారిటీతో ఆశీర్వదించారని తెలిపారు. ప్రధాని మోదీ రాష్ట్రానికి అన్ని విధాలా అండగా నిలుస్తున్నారని, ముఖ్యమంత్రి చంద్రబాబు కుప్పకూలిన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నారని పవన్ కొనియాడారు. “ఈ ఏడాది కాలంలోనే రాష్ట్రానికి రూ.4 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులను ఆకర్షించగలిగాం. గత వైసీపీ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులను పక్కదారి పట్టించింది. మేము గ్రామపంచాయతీలకు కేటాయించే నిధులను గణనీయంగా పెంచాం. ‘పల్లెపండగ’ కార్యక్రమం ద్వారా గ్రామీణ రహదారుల అభివృద్ధికి బాటలు వేశాం” అని ఆయన వివరించారు.
అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ నేతలు సాగించిన అరాచకాలను, ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ఇంకా కొనసాగిస్తున్నారని పవన్ మండిపడ్డారు. “గొంతులు కోస్తామంటూ బెదిరింపులకు పాల్పడితే, తాటాకు చప్పుళ్లకు భయపడే ప్రసక్తే లేదు. వైసీపీకి కనీసం ప్రతిపక్షానికి అవసరమైన సంఖ్యా బలం కూడా లేదు. అయినా వారి వైఖరిలో ఎలాంటి మార్పు రావడం లేదు” అని ఆయన విమర్శించారు. శాంతిభద్రతల పరిరక్షణ విషయంలో ప్రభుత్వం ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించబోదని స్పష్టం చేశారు. “మేము చట్టానికి లోబడి వ్యవహరించాలి కాబట్టి సంయమనంతో ఉంటున్నాం. ఎన్నో అవమానాలు, దెబ్బలు తిని ఈ స్థాయికి చేరుకున్నాం. ఎవరైనా పిచ్చివేషాలు వేసి, ప్రజల్లో భయాందోళనలు సృష్టించాలని చూస్తే ఉపేక్షించేది లేదు. అలాంటి వారిని తొక్కి నారతీస్తాం” అని పవన్ కల్యాణ్ తీవ్రంగా హెచ్చరించారు.