AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

జగన్‌కు మానవత్వమే లేదు… ఉంటే సింగయ్యను అలా వదిలేసి వెళ్లరు.. షర్మిల సంచలన వాఖ్యలు..!

పల్నాడు జిల్లా రెంటపాళ్ల పర్యటనలో ఏటూకూరు బైపాస్‌ వద్ద జరిగిన దుర్ఘటనలో చీలి సింగయ్య అనే వ్యక్తి మృతి చెందడానికి మాజీ ముఖ్యమంత్రి జగన్ నిర్లక్ష్యమే కారణమని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల తీవ్రంగా ఆరోపించారు. నేడు తిరుపతిలో విలేకరులతో మాట్లాడిన ఆమె, జగన్ వ్యవహారశైలిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జరిగిన తప్పిదానికి క్షమాపణ చెప్పాల్సింది పోయి, దానిని ఫేక్ వీడియో అంటూ ప్రచారం చేయడం దారుణమని ఆమె మండిపడ్డారు.

 

“ఒక వ్యక్తి చనిపోతే, కనీసం మానవత్వం చూపకుండా, ఫేక్ వీడియో అని చెప్పి తప్పును కప్పిపుచ్చుకోవాలని చూడటం దారుణం. నిజంగా మానవత్వం ఉంటే, ఆ కుటుంబానికి 5 కోట్లో, 10 కోట్లో పరిహారం ఇచ్చి, వారిని క్షమించమని అడగాలి. ఐదేళ్లుగా ప్రజా సమస్యలను గాలికొదిలేసి, ఇప్పుడు ప్రజల మధ్యకు రావడం విడ్డూరంగా ఉంది” అని షర్మిల వ్యాఖ్యానించారు.

 

జగన్ నిర్వహిస్తున్న కార్యక్రమాలు కేవలం బలప్రదర్శన, జన సమీకరణ కోసమే తప్ప, ప్రజల సమస్యల పరిష్కారానికి కాదని షర్మిల విమర్శించారు. “తనకు డబ్బుంది, బలం ఉందని నిరూపించుకోవడానికే జగన్ ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి జన సమీకరణ కార్యక్రమాలకు కూటమి ప్రభుత్వం అనుమతులు ఇవ్వకూడదని నేను డిమాండ్ చేస్తున్నాను” అని ఆమె స్పష్టం చేశారు. ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఉన్న వారందరినీ విచారణకు పిలవాలని, కారు కింద ఒక మనిషి పడిపోయినా కనీసం పట్టించుకోకుండా ముందుకు వెళ్లిపోవడం అత్యంత దారుణమని ఆమె అన్నారు.

 

“తప్పు జరిగినప్పుడు దాన్ని అంగీకరించాలి. అంతేగానీ ఫేక్ వీడియో అంటూ సమర్థించుకోవడం సరికాదు. జగన్ తన పర్యటనలో కారు సైడ్ బోర్డు మీద నిలబడి ప్రజలకు షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఆయన పర్యటనకు కేవలం 5 వాహనాలకు మాత్రమే అనుమతి ఉంటే, ఏకంగా 50 వాహనాలతో కాన్వాయ్‌గా వెళ్లి, నిబంధనలు ఉల్లంఘించి సైడ్ బోర్డుపై నిలబడటం జగన్ చేసిన తప్పు కాదా?” అని షర్మిల ప్రశ్నించారు. జగన్‌కు మానవత్వం అనే పదానికి అర్థమే తెలియదని, నిజంగా మానవత్వం ఉంటే సింగయ్యను ప్రమాదం జరిగిన వెంటనే ఆసుపత్రికి ఎందుకు తరలించలేదని, ఇప్పటివరకు ఆ కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలేదని ఆమె నిలదీశారు.

 

బాధిత సింగయ్య కుటుంబానికి జగన్ కనీసం 10 కోట్ల రూపాయల పరిహారం తక్షణమే అందించాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10