AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

రైతులకు కేంద్రం గుడ్ న్యూస్… ఖరీఫ్ పంటలకు మద్దతు ధర పెంచిన కేంద్రం..

దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది రైతులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. 2025-26 ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్‌కు సంబంధించి 14 రకాల పంటలకు కనీస మద్దతు ధరను (ఎంఎస్‌పీ) పెంచుతూ బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఈఏ) ఈ ప్రతిపాదనలకు ఆమోదముద్ర వేసింది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు.

 

పెంచిన ధరల ప్రకారం, సాధారణ రకం వరి ధాన్యం కనీస మద్దతు ధర క్వింటాల్‌కు రూ. 69 పెరిగి రూ. 2,369కి చేరింది. అదే విధంగా ‘ఏ’ గ్రేడ్ రకం వరి ధాన్యం ధర క్వింటాల్‌కు రూ. 2,389గా నిర్ధారించారు. ఈసారి అత్యధికంగా నైజర్‌సీడ్ (ఒడిసలు) ఎంఎస్‌పీ క్వింటాల్‌కు రూ. 820 పెరిగింది. ఆ తర్వాతి స్థానాల్లో రాగి (రూ. 596), పత్తి (రూ. 589), నువ్వులు (రూ. 579) ఉన్నాయి. మొక్కజొన్న ఎంఎస్‌పీ రూ. 2,225 నుంచి రూ. 2,400కు పెరిగింది.

 

నూనెగింజల విషయానికొస్తే, వేరుశనగపై రూ. 480, పొద్దుతిరుగుడు విత్తనాలపై రూ. 441, సోయాబీన్‌పై రూ. 436 చొప్పున మద్దతు ధరను పెంచారు. పప్పుధాన్యాలలో కంది మద్దతు ధర రూ. 450, పెసరపప్పు రూ. 86 పెరగ్గా, మినుములకు రూ. 400 అదనంగా లభించనుంది.

 

రైతుల ఆదాయాన్ని పెంచడం, వ్యవసాయ రంగంలో ఇబ్బందులను తగ్గించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిర్ణయాలు తీసుకుందని తెలుస్తోంది. జూన్‌లో ప్రారంభమయ్యే రుతుపవనాల సాగు సీజన్‌కు ముందే ఈ ప్రకటన వెలువడటం గమనార్హం. ఇది రైతులు ఏ పంటలు వేయాలనే విషయంలో నిర్ణయం తీసుకోవడానికి దోహదపడుతుంది. మార్కెట్‌లో ధరలు పడిపోయినప్పటికీ, రైతులకు కనీస గిట్టుబాటు ధర లభించేలా ఎంఎస్‌పీ భరోసా కల్పిస్తుంది.

 

వడ్డీ రాయితీ పథకం కొనసాగింపు

 

కనీస మద్దతు ధరల పెంపుతో పాటు, సవరించిన వడ్డీ రాయితీ పథకాన్ని (MISS) 2025-26 ఆర్థిక సంవత్సరానికి కూడా కొనసాగించాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. ఈ పథకం కింద రైతులకు ఇచ్చే స్వల్పకాలిక రుణాలపై ప్రస్తుతం ఉన్న 1.5% వడ్డీ రాయితీ యథాతథంగా కొనసాగుతుంది.

 

కిసాన్ క్రెడిట్ కార్డ్ (కేసీసీ) ద్వారా రైతులకు సులభంగా రుణాలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోంది. దీని కింద రైతులు రూ. 3 లక్షల వరకు స్వల్పకాలిక రుణాలను 7% వడ్డీకే పొందవచ్చు. ఇందులో 1.5% ప్రభుత్వం రాయితీగా భరిస్తుంది. దీంతో రుణాలిచ్చే బ్యాంకులకు, సంస్థలకు భారం తగ్గుతుంది. అంతేకాకుండా, తీసుకున్న రుణాలను సకాలంలో తిరిగి చెల్లించే రైతులకు అదనంగా 3% ప్రోత్సాహక రాయితీ (PRI) లభిస్తుంది. దీనివల్ల రైతులకు కేవలం 4% వడ్డీకే రుణం అందుబాటులోకి వస్తుంది. పశుసంవర్ధక లేదా మత్స్య పరిశ్రమ కోసం రుణాలు తీసుకునే వారికి రూ. 2 లక్షల వరకు ఈ ప్రయోజనం వర్తిస్తుంది.

ANN TOP 10