AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

9 ఏళ్ల తర్వాత క్వాలిఫయర్-1 ఆడుతున్న ఆర్సీబీ..! ఈసారైనా ..

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు అద్భుత ప్రదర్శనతో ముందుకు సాగుతోంది. లీగ్ ప్రారంభం నుంచే విజయాల బాటలో పయనిస్తూ, పాయింట్ల పట్టికలో టాప్-2గా నిలిచి క్వాలిఫయర్-1కు అర్హత సాధించింది. దాదాపు తొమ్మిదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత బెంగళూరు జట్టు క్వాలిఫయర్-1 ఆడనుండటం విశేషం. ఈసారి ఎలాగైనా టైటిల్ గెలిచి, ఏళ్లనాటి కలను నెరవేర్చుకోవాలనే పట్టుదలతో జట్టు కనిపిస్తోంది.

 

ఐపీఎల్ 2025 సీజన్‌కు ముందు జట్టులో కీలక మార్పులు చేసిన ఆర్సీబీ, అన్ని విభాగాల్లోనూ పటిష్టంగా తయారైంది. ఈ మెరుగైన ప్రదర్శనతో ఈసారి కప్ మనదే అనే అభిమానుల ఆకాంక్షలకు బలం చేకూరుతోంది. ఫైనల్ చేరడానికి రెండు అవకాశాలు ఉండటం ఆర్సీబీకి సానుకూలాంశం.

 

గత చరిత్రను పరిశీలిస్తే, ఆర్సీబీ పలుమార్లు ప్లేఆఫ్స్‌కు చేరినా టైటిల్‌ను మాత్రం అందుకోలేకపోయింది. 2009, 2011, 2016 సీజన్లలో ఫైనల్ వరకు దూసుకెళ్లినప్పటికీ, తుదిపోరులో ఓటమిపాలైంది. ముఖ్యంగా 2009లో హైదరాబాద్ చేతిలో, 2011లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో, 2016లో సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో స్వల్ప తేడాతో ఓడి కప్‌ను చేజార్చుకుంది. 2015, 2020, 2021, 2022, గత (2024) సీజన్లలో కూడా ప్లేఆఫ్స్‌కు చేరినా, కీలక మ్యాచ్‌లలో ఓటమి చవిచూసింది.

 

తొలి నాలుగు సీజన్లలో మూడుసార్లు ప్లేఆఫ్‌కు చేరిన ఆర్సీబీ… మూడేళ్ల వ్యవధిలో రెండుసార్లు త్రుటిలో టైటిల్‌ను చేజార్చుకుంది. ఆ తర్వాత, 2023లో మినహాయించి, 2020 నుంచి ఇప్పటి వరకు అన్ని సీజన్లలో ప్లేఆఫ్స్‌కు చేరుకున్న బెంగళూరుకి ఒక్కసారి కూడా అదృష్టం కలిసి రాలేదు.

 

ప్రస్తుత సీజన్‌లో అద్భుత ఆటతీరుతో టాప్-2లో నిలిచిన బెంగళూరు, టైటిల్ కలను సాకారం చేసుకోవాలంటే తొలుత క్వాలిఫయర్-1లో బలమైన పంజాబ్ కింగ్స్‌ను ఓడించాల్సి ఉంది. ఈ మ్యాచ్‌లో ఓడినా, ఫైనల్ చేరేందుకు మరో అవకాశం ఉంటుంది. అయితే, ఎలిమినేటర్ మ్యాచ్‌లో తలపడనున్న గుజరాత్, ముంబై జట్లను కూడా తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ఈ నేపథ్యంలో ఆర్సీబీ అభిమానులు ఎంతో ఉత్కంఠతో రాబోయే మ్యాచ్‌ల కోసం ఎదురుచూస్తున్నారు.

ANN TOP 10