AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

సినిమాగా ‘ఆపరేషన్ సిందూర్’.. ఫస్ట్ పోస్టర్ రిలీజ్..

జమ్మూకశ్మీర్ లోని పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం ‘ఆపరేషన్ సిందూర్’ చేపట్టిన విషయం తెలిసిందే. ఈ ఆపరేషన్ లో భాగంగా పాకిస్థాన్ లోని ఉగ్ర స్థావరాలపై సైన్యం విరుచుకుపడింది. తొమ్మిది ఉగ్రవాద శిబిరాలను బాంబులతో నేలమట్టం చేసింది. దీంతో రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. డ్రోన్లు, క్షిపణులు, షెల్లింగ్ లతో సరిహద్దు ప్రాంతాలు దద్దరిల్లిపోతున్నాయి. ఇదిలా ఉండగా.. ఆపరేషన్ సిందూర్ పేరుతో భారత సైన్యం చేపట్టిన ఉగ్రవాద నిర్మూలనను తెరకెక్కించనున్నట్లు నిక్కీ విక్కీ భగ్నానీ ఫిల్మ్స్, ది కంటెంట్ ఇంజనీర్ సంస్థలు ప్రకటించాయి. “ఆపరేషన్ సిందూర్” పేరుతో కొత్త సినిమాను అధికారికంగా ప్రకటించాయి. పహల్గామ్ ఉగ్రదాడికి భారత సాయుధ దళాలు ఇచ్చిన ధీటైన, వ్యూహాత్మక సమాధానం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కిస్తామని ప్రకటించాయి. ఈ ప్రతిష్ఠాత్మక చిత్రానికి ఉత్తమ్ మహేశ్వరి దర్శకత్వం వహించనున్నారు.

 

ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో ఒక మహిళా సైనికురాలు వెనుకకు తిరిగి నిలబడి, సైనిక దుస్తుల్లో రైఫిల్ పట్టుకుని, తన పాపిటలో సింధూరం దిద్దుకుంటున్న దృశ్యం ఆకట్టుకుంటోంది. యుద్ధ ట్యాంకులు, ముళ్ల కంచెలు, గగనతలంలో దూసుకెళ్తున్న యుద్ధ విమానాలు వంటి అంశాలు పోస్టర్ నేపథ్యంగా ఉండి, ధైర్యం, త్యాగం, దేశభక్తి వంటి భావనలను ప్రతిబింబిస్తున్నాయి. “ఆపరేషన్ సిందూర్” అనే టైటిల్‌ను ప్రముఖంగా ప్రదర్శించగా, “సిందూర్”లోని రెండవ ‘O’ అక్షరం స్థానంలో కుంకుమ అద్దినట్లు చూపించారు. త్రివర్ణ పతాక రంగులలో “భారత్ మాతా కీ జై” అనే నినాదం దేశభక్తి స్ఫూర్తిని మరింత ఇనుమడింపజేస్తోంది. ఉద్విగ్నభరితమైన, భావోద్వేగమైన కథనంతో ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చిత్ర బృందం ఆశాభావం వ్యక్తం చేసింది. నటీనటుల వివరాలు ఇంకా ప్రకటించాల్సి ఉంది.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10