AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఆపరేషన్ ‘కగార్’ నిలిపివేత.. కర్రెగుట్టల నుంచి సరిహద్దుకు బలగాలు..

దేశ సరిహద్దుల్లో నెలకొన్న తాజా పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర రిజర్వ్ పోలీస్ దళం (సీఆర్పీఎఫ్) బలగాల కదలికల్లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ప్రస్తుతం కొనసాగుతున్న ‘ఆపరేషన్ సిందూర్’ ప్రభావం ‘ఆపరేషన్ కగార్‌’పై స్పష్టంగా కనిపిస్తోంది. భారత్-పాకిస్థాన్ సరిహద్దు ప్రాంతాల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నందున కర్రెగుట్టల ప్రాంతంలో మోహరించిన సీఆర్పీఎఫ్ బలగాలను దశలవారీగా వెనక్కి పిలిపిస్తున్నారు. ఈ దళాలను తక్షణమే సరిహద్దుల్లోని హెడ్‌క్వార్టర్స్‌కు తరలించాలని ఉన్నతస్థాయి నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి.

 

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ‘ఆపరేషన్ కగార్‌’లో భాగంగా ఇప్పటివరకు పామునూరు, ఆలుబాక, పెద్దగుట్ట వంటి ప్రాంతాల్లో విధులు నిర్వర్తిస్తున్న సీఆర్పీఎఫ్ జవాన్లు తమ స్థావరాల నుంచి వెనుదిరుగుతున్నారు. ఈ బలగాలన్నీ ఆదివారం ఉదయం లోపు భారత్-పాక్ సరిహద్దుల్లోని నిర్దేశిత ప్రాంతాలకు చేరుకుని, అక్కడ రిపోర్ట్ చేయాలని స్పష్టమైన ఆదేశాలు అందాయి. సరిహద్దుల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేసే చర్యల్లో భాగంగా ఈ పునర్‌వ్యవస్థీకరణ జరుగుతున్నట్లు తెలుస్తోంది.

 

అయితే, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలో మావోయిస్టు వ్యతిరేక కార్యకలాపాల కోసం చేపట్టిన ‘ఆపరేషన్ కగార్‌’ మాత్రం యథావిధిగా కొనసాగుతుందని అధికారులు స్పష్టం చేశారు. ప్రస్తుత బలగాల తరలింపు కేవలం ‘ఆపరేషన్ సిందూర్’ అవసరాల నిమిత్తం, పాకిస్థాన్ సరిహద్దుల్లో భద్రతను పటిష్టం చేయడం కోసమేనని తెలుస్తోంది. ఈ పరిణామం సరిహద్దు ప్రాంతాల్లో నెలకొన్న తీవ్రతను సూచిస్తోందని రక్షణ రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు ఈ బలగాలు సరిహద్దు ప్రాంతాల్లోనే అప్రమత్తంగా ఉండనున్నాయి.

ANN TOP 10