పహల్గామ్‌లో ఇటీవల చోటు చేసుకున్న ఉగ్రవాద దాడి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. దేశవ్యాప్తంగా భద్రతా సంసిద్ధతను సమీక్షించి, పటిష్టం చేసే దిశగా చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా, అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు అప్రమత్తంగా ఉండాలని, భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేయాలని సూచించింది.
భద్రతా పరమైన సంసిద్ధతను పరీక్షించేందుకు వీలుగా ఈ బుధవారం ప్రత్యేకంగా మాక్ డ్రిల్స్ నిర్వహించాలని కేంద్రం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కీలక సూచనలు జారీ చేసింది. అంతేకాకుండా, ఈ మాక్ డ్రిల్స్ సందర్భంగా భద్రతా సన్నద్ధతపై సాధారణ పౌరులకు కూడా అవగాహన కల్పించాలని కేంద్రం స్పష్టం చేసింది. ఏదైనా ఊహించని, అత్యవసర పరిస్థితి తలెత్తితే ఏ విధంగా స్పందించాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దానిపై ప్రజలకు తెలియజేయాలని సూచించింది.