AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కూరగాయలు కొనడానికి బయటికి వెళ్లిన బాలికను కిడ్నాప్ చేసి.. రోజుల తరబడి అత్యాచారం..

ఉత్తరప్రదేశ్‌లోని ఇటావా జిల్లాలో దారుణమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. కూరగాయల కోసం బయటకు వెళ్లిన 13 ఏళ్ల బాలికను అడ్రస్ అడిగే నెపంతో కిడ్నాప్ చేసి, అత్యాచారానికి పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపింది. పోలీసులు కేసు నమోదు చేసి, ఒక నిందితుడిని అరెస్టు చేశారు.

 

వివరాల్లోకి వెళితే… ఏప్రిల్ 26వ తేదీ సాయంత్రం, 13 ఏళ్ల బాలిక కూరగాయలు కొనేందుకు ఇంటి నుంచి బయటకు వెళ్లింది. కొంత దూరం వెళ్లాక, ఒక కారు ఆమె వద్దకు వచ్చి ఆగింది. కారులో ఉన్న విష్ణు అనే వ్యక్తి, ఓ అడ్రస్ గురించి బాలికను అడిగాడు. ఆమె దారి చెబుతుండగా, విష్ణు ఒక్కసారిగా ఆమెను బలవంతంగా కారులోకి లాగేశాడు.

 

“కొద్ది దూరం వెళ్లాక, కారును ఒక మెడికల్ స్టోర్ వద్ద ఆపి, వాటర్ బాటిల్, కొన్ని మందులు కొన్నాడు. ఆ మందులను నీళ్లలో కలిపి నన్ను బలవంతంగా తాగించాడు” అని బాధితురాలు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొంది. “వెంటనే నేను స్పృహ కోల్పోయాను. నన్ను ఒక హోటల్‌కు తీసుకెళ్లారు. అక్కడ రేష్మ అనే అమ్మాయి పేరుతో ఉన్న నకిలీ ఐడీ కార్డు ఇచ్చి, దానిపై సంతకం చేయమని బలవంతం చేశారు. నాపై అత్యాచారం చేశాడు. భవిష్యత్తులో కూడా నిన్ను వెతికి పట్టుకుని ఇదే పనిచేస్తానని బెదిరించాడు” అని బాలిక తన గోడు వెళ్లబోసుకుంది.

 

హోటల్ నుంచి బయటకు తీసుకొచ్చిన తర్వాత నిందితుడు విష్ణు, తన స్నేహితుడైన నారాయణ్ అనే వ్యక్తికి ఫోన్ చేశాడని, ఇద్దరూ కలిసి తనను మార్గమధ్యంలో వదిలిపెట్టారని బాలిక తెలిపింది. అక్కడకు వచ్చిన సంజయ్ అనే మరో వ్యక్తి తనను అతని ఇంటికి తీసుకెళ్లాడని చెప్పింది.

 

“సంజయ్ నాకు కూల్ డ్రింక్ ఇచ్చాడు, అది తాగిన తర్వాత మళ్లీ స్పృహ తప్పింది. మరుసటి రోజు ఉదయం మెలకువ వచ్చి నా ఫోన్ అడిగాను. కానీ అందులో సిమ్ కార్డు లేదు. అక్కడి నుంచి నన్ను వాళ్ల సోదరి ఇంటికి తీసుకెళ్లి, వాళ్ల తమ్ముడిని పెళ్లి చేసుకోమని బలవంతం చేశారు” అని బాధితురాలు వివరించింది.

 

బాధితురాలి తండ్రి శివరామ్ సింగ్, తన భార్య, కుమారుడితో కలిసి ఢిల్లీలో నివసిస్తున్నారు. కుమార్తె మాత్రం గ్రామంలో తాతయ్య, బామ్మల వద్ద ఉంటోంది. “ఏప్రిల్ 26న నా కూతురు కనిపించకుండా పోయింది. మే 1న ఆచూకీ లభించింది. ఈ మధ్య కాలంలో దాన్ని ఎన్నో చోట్లకు తిప్పారు, ఎన్నో అఘాయిత్యాలకు పాల్పడ్డారు” అని శివరామ్ సింగ్ ఆవేదన వ్యక్తం చేశారు.

 

“మాకు చావు తప్ప మరో మార్గం కనిపించడం లేదు. మాకు న్యాయం కావాలి, అంతకుమించి ఏమీ వద్దు. మా అమ్మాయిని ఎవరు పెళ్లి చేసుకుంటారు?” అంటూ ఆయన కన్నీటిపర్యంతమయ్యారు.

 

శివరామ్ సింగ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మే 1వ తేదీన బాలికను రక్షించి, నిందితుల్లో ఒకరిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై లోతుగా దర్యాప్తు కొనసాగుతోందని, పరారీలో ఉన్న ఇతర నిందితుల కోసం గాలిస్తున్నామని వెల్లడించారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10