AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

స్వచ్ఛందంగా స్వదేశం వెళ్లే అక్రమ వలసదారులకు వెయ్యి డాలర్ల నగదు ప్రోత్సాహకం… అమెరికా కీలక ప్రకటన..

అమెరికాలో నివసిస్తున్న అక్రమ వలసదారులను వెనక్కి పంపే ప్రక్రియను వేగవంతం చేసే దిశగా డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. స్వచ్ఛందంగా తమ స్వదేశాలకు తిరిగి వెళ్లే వారికి 1000 డాలర్ల నగదు ప్రోత్సాహకంతో పాటు ప్రయాణ ఖర్చులను కూడా చెల్లించనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం ఒక ప్రకటన విడుదల చేసింది.

 

ఈ కొత్త విధానం కోసం కస్టమ్స్ & బోర్డర్ ప్రొటెక్షన్ (సీబీపీ) రూపొందించిన ‘సీబీపీ హోమ్ యాప్’ను ఉపయోగించుకోవాలని డీహెచ్‌ఎస్ సూచించింది. ఈ యాప్ ద్వారా తమ వివరాలు నమోదు చేసుకుని, స్వదేశానికి తిరిగి వెళ్లినట్లు నిర్ధారించుకున్న తర్వాత వారికి 1000 డాలర్ల ప్రోత్సాహకం అందజేయనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. ఈ విధానం ద్వారా అక్రమ వలసదారుల బహిష్కరణకు అయ్యే ఖర్చు సుమారు 70 శాతం వరకు తగ్గుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ప్రస్తుతం ఒక అక్రమ వలసదారుడిని గుర్తించి, అదుపులోకి తీసుకుని, వారి దేశానికి పంపడానికి సగటున 17,121 డాలర్ల ఖర్చవుతుందని డీహెచ్‌ఎస్ తెలిపింది.

 

“చట్టవిరుద్ధంగా అమెరికాలో ఉంటున్నవారు అరెస్టును నివారించుకోవడానికి స్వచ్ఛందంగా దేశం విడిచి వెళ్లడమే అత్యంత సురక్షితమైన, ఉత్తమమైన మార్గం” అని హోంల్యాండ్ సెక్యూరిటీ కార్యదర్శి క్రిస్టీ నోమ్ తెలిపారు. అక్రమ వలసదారుల బహిష్కరణను పెంచడం తన ప్రభుత్వ విజయాల్లో కీలకమైనదని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గతంలో పలుమార్లు పేర్కొన్నారు. అయితే, చట్టపరమైన, నిర్వాహణపరమైన కారణాల వల్ల బహిష్కరణల సంఖ్య అనుకున్న లక్ష్యాలను చేరుకోలేదని బ్రూకింగ్స్ ఇన్‌స్టిట్యూషన్ వంటి సంస్థలు విశ్లేషించాయి. ఈ కొత్త ప్రోత్సాహక పథకం బహిష్కరణల సంఖ్యను పెంచుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10