సామాన్యులకు తెలంగాణ ప్రభుత్వం బిగ్ షాక్ ఇచ్చింది. విజయ పాల ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర పాడి పరిశ్రమాభివృద్ధి సహకార సమాఖ్య ఉత్తర్వులు కూడా జారీ చేసింది. దీంతో పెరిగిన ధరలు శనివారం నుంచే అమల్లోకి వచ్చినట్లు స్పష్టం చేసింది. విజయ పాలకు సంబంధించి లీటర్‌పై గరిష్టంగా రూ.3 పెంచుతూ ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో సామాన్యులపై మరింత భారం పడనుంది.
డబుల్ టోన్డ్ మిల్క్ ధర లీటర్‌పై గతంలో రూ.51 నుంచి రూ.55కు పెంచారు. ఇప్పుడు దానిని రూ.58 పెంచుతున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇక అరలీటర్ టోన్డ్ మిల్క్ ధర గతంలో రూ.26 ఉండగా.. ఇప్పుడు రూ.27కు పెంచినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. అసలే నిత్యావసర సరుకుల ధరలు మండుతున్నాయి. వంటగ్యాస్ ధర కాస్త తగ్గుతున్నా.. రోజూ ఉపయోగించే పాల ధరలను పెంచడం సామాన్యులకు భారమేనని చెప్పవచ్చు.
పాల ధరలను పెంచే ముందు పాడి రైతులతో ప్రభుత్వం సమావేశం నిర్వహిస్తూ ఉంటుంది. కానీ ఆ సారి అలాంటి సమావేశం నిర్వహించకుండానే పాల ధరలు పెంచినట్లు ప్రచారం సాగుతోంది. గుట్టుచప్పుడు కాకుండా విజయ పాల ధరలను పెంచుతున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఒకవైపు పెట్రోల్, డీజిల్ ధరలు సామాన్యుడి నెత్తిపై గుదిబండలా తయారవ్వగా.. ఇప్పుడు పాల ధరలు పెంచడంతో సామాన్యులపై మరో పిడుగు పడింది. అయితే నిర్వహణ ఖర్చు పెరగడం, రవాణా ఖర్చులు, పాల సేకరణ ధరలు పెరగడంతో పాల ధరలు పెంచినట్లు విజయ డెయిరీ చెబుతోంది.