తెలంగాణ ఆర్టీసీ ఎండీగా సజ్జనార్ బాధ్యతలు చేపట్టాక పలు విప్లవాత్మక చర్యలతో ముందుకెళుతున్నారు. కొత్త బస్సులు సౌకర్యాలు కల్పిస్తున్నారు. అదే సమయంలో తాజాగా ధరలు కూడా పెంచేశాడు. రాష్ట్రవ్యాప్తంగా టోల్ రూట్లలో ఆర్టీసీ చార్జీలు పెరిగాయి. ఒక్కో టికెట్టుకు రూ.5 నుంచి గరిష్టంగా రూ20 వరకూ పెంచారు. టోల్ చార్జీలు పెరగడంతోనే ఆర్టీసీ ఈ నిర్ణయం తీసుకుందన్నది చెబుతున్నారు. అయితే ఏ రూట్లో ఏ మేరకు పెరిగాయనే వివరాలను ఆర్టీసీ అధికారులు అధికారికంగా ప్రకటించారు. టోల్ చార్జీల పేరు చెప్పి మాత్రం పెంచారని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. దీనిపైనే ప్రయాణికుల్లో కాస్త గందరగోళం నెలకొంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రతిరోజు సుమారు 30 లక్షల మంది ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. అయితే టోల్ రూట్లలో మాత్రం దాదాపుగా 4 లక్షల మంది జర్నీ చేస్తున్నారు. వీరిపై మాత్రమే అదనపు చార్జీలు వర్తిస్తాయని ఆర్టీసీ యాజమాన్యం చెబుతోంది.
ఆర్డినరీ పల్లెవెలుగు బస్సు చార్జీల్లో ఇప్పటివరకైతే మార్పు లేదు. సెస్ పెరగడంతోనే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఆర్టీసీ అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఇదివరకూ ఒకసారి ఆర్టీసీ చార్జీలు పెంచారు. దసరా సందర్భంగా ప్రయాణికులపై ఈ భారం వేశారు. ఇప్పుడు మళ్లీ పెంచడంపై ప్రయాణికులు మండిపడుతున్నారు. టోల్ చార్జీల పేరు చెప్పి మొత్తం పెంచడం కరెక్ట్ కాదంటూ ప్రయాణికులు విమర్శలు గుప్పిస్తున్నారు.