బీఆర్‌ఎస్ నేతలకు రేవంత్ సూటి ప్రశ్న
కొండలు, గుట్టలు, లే అవుట్లకు కూడా రైతు భరోసా ఇవ్వాలా అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. దొంగ పాస్ పుస్తకాలు తయారు చేసి రైతు బంధు తీసుకున్నారని ఆరోపించారు. తెలంగాణ అసెంబ్లీ వేదికగా రైతు భరోసాపై శనివారం జరిగిన చర్చలో సీఎం రేవంత్ మాట్లాడారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ పెద్దల అనుచరులం, బంధువులమని వేల కోట్లు కొల్లగొట్టారని విమర్శించారు. 80వేల పుస్తకాలు చదివినవారు వచ్చి రైతు భరోసాపై సలహా ఇస్తారు అనుకున్నామని అన్నారు. వారిని ఆదర్శంగా తీసుకుని రైతు భరోసా ఇవ్వాలని చెప్పడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. వారు కాదు తమకు ఆదర్శమని… వాళ్లను ఆదర్శంగా తీసుకుంటే తాము ఇక్కడ ఉండేవారం కాదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు.
వ్యవసాయదారులే ఆదర్శం..
2023లో ఓడిపోయారు, ఆ తర్వాత డిపాజిట్లు పోయాయని… ఇకముందు ఊడ్చుకు పోతారని సీఎం రేవంత్ విమర్శించారు. వ్యవసాయ దారులు తమకు ఆదర్శమని ఉద్ఘాటించారు. బీఆర్‌ఎస్ చిత్ర, విచిత్ర వ్యవహారాలను ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. రైతు భరోసా ఎవరికి ఇవ్వాలో సూచనలు ఇవ్వాలని అన్నారు. అబద్ధాల సంఘం అధ్యక్షుడు సభకు రాలేదని ఎద్దేవా చేశారు. ఉపాధ్యక్షుడు సభకు వచ్చి రైతు ఆత్మహత్యలపై అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు.2014లో 898 మంది, 2015లో 1358, 2016లో 632 మంది మొత్తంగా 3వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు.
2014 నుంచి16 మధ్య ఎన్‌సీఆర్‌బీ ప్రకారం రైతు ఆత్మహత్యల్లో భారతదేశం రెండో స్థానంలో ఉందన్నారు. 2019లో డిసెంబర్‌లో కేంద్ర మంత్రి ఇచ్చిన సమాధానమిదని.. ఇది అందరూ తలదించుకునే విషయమని చెప్పారు. దీన్ని కూడా కొంతమంది గొప్పగా చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఓడినా మనుషులు మారలేదని… మాటలు మారడం లేదని సీఎం రేవంత్‌రెడ్డి విమర్శించారు. బీఆర్‌ఎస్ పాలనలో వెనక్కి తిరిగి చూసుకుంటే ఏం జరిగిందో తెలుస్తుందని అన్నారు. వాళ్ల పదేళ్ల పాలనలో చేసిన రుణమాఫీ రూ.16, 909 వేల కోట్లు అని చెప్పారు. వారిచ్చింది వడ్డీకే సరిపోయిందన్నారు. అసలు అలాగే ఉందని… రూ.21 లక్షల మందికి మాత్రమే రుణమాఫీ జరిగిందని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.