AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

సంవిధాన్…సంఘ్ బుక్ కాదు: లోక్‌సభ తొలి ప్రసంగంలో ప్రియాంక

దేశంలో జరిగే అన్నిటికీ నెహ్రూనే కారణమని గతం గురించే బీజేపీ మాట్లాడుతుందని, ఆయన జ్ఞాపకాలను చెరిపివేసే ప్రయత్నం చేస్తోందని, అయినప్పటికీ స్వాతంత్ర్య పోరాటం, జాతి నిర్మాణంలో ఆయన పాత్రను ఎవరూ చెరిపివేయలేరని లోక్‌సభలో కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా (Priyanka Gandhi Vadra) అన్నారు.

గత పదేళ్లలో దేశ ప్రగతి కోసం ఏం చేశారో, ఇప్పుడేం చేస్తు్న్నారో వాళ్లు మాట్లాడాలని అన్నారు. ఇది సంవిధాన్ అనీ సంఘ్ బుక్ కాదని విమర్శించారు. భారత రాజ్యాంగం 75వ వసంతంలోకి అడుగుపెట్టిన నేపథ్యంలో దీనిపై ప్రత్యేక చర్చలో ప్రియాంక మాట్లాడారు. అదానీ అంశంపై ప్రభుత్వం చర్చించేందుకు భయపడటం వల్లే వ్యూహాత్మకంగా లోక్‌సభను సజావుగా నడవనీయడం లేదని విమర్శించారు. రాజ్యాంగంపై చర్చ సందర్భంగా రాహుల్ గాంధీ కూడా సభకు హాజరయ్యారు.

”సంభాల్ బాధిత కుటుంబాలకు చెందిన కొందరు నన్ను కలుసుకునేందుకు వచ్చారు. వారిలో ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఒకరికి నా కుమారుడి వయస్సు ఉంటుంది. మరొకరికి 17 ఏళ్లు. వాళ్ల తండ్రి ఒక టైలర్. ఆయనకు ఒక డ్రీమ్ ఉంది. తన పిల్లలను బాగా చదివించి ఒకరిని డాక్టర్‌ను, మరొకరిని జీవితంలో స్థిరపడేలా చేయాలని అనుకునేవాడు. ఆయనను పోలీసులు కాల్చిచంపారు. తాను పెరిగి పెద్దయ్యాక తన తండ్రి కోరిక మేరకు డాక్టర్ అవుతానని 17 ఏళ్ల అద్నాన్ చెప్పాడు. అతని మనసులో అలాంటి ఆశలు, కలలకు అవకాశం కల్పించింది భారత రాజ్యాంగమే” అని ప్రియాంక అన్నారు.

ఉన్నావో అత్యాచారం, నిరుద్యోగం, వయనాడ్‌లో కొండచరియల వైపరీత్యం, ద్రవ్యోల్బణం వంటి అంశాలను ప్రియాంక తన చర్యలో ప్రస్తావించారు. ఉన్నావోలో అత్యాచార బాధితురాలి ఇంటికి వెళ్లానని, ఆమె తండ్రిని కలిసానని, వారు వ్యవసాయ భూమిని తగులపెట్టారని, సోదరులను కొట్టారని, తమకు న్యాయం జరగాలని ఆయన వాపోయారని సభ దృష్టికి ప్రియాంక తెచ్చారు. భారత రాజ్యాంగం మహిళలకు అధికారం ఇచ్చిందని, కానీ మహిళలకు ఎలాంటి ప్రయోజనం చేకూరడం లేదని, తన హక్కుల కోసం వారు మరో పదేళ్లు వేచిచూడాలా అని ప్రశ్నించారు. ప్రభుత్వం రైతులకు భద్రత కల్పించడం లేదని, నిరుద్యోగం, ద్రవ్యోల్బణానికి ఎలాంటి పరిష్కారం చూపించడం లేదని విమర్శించారు. ఈ ప్రభుత్వంలో ధనవంతులు ఇంకా ధనవంతులవుతుంటే, పేదవాళ్లు మరింత పేదవాళ్లవుతున్నారని ఆక్షేపించారు.

పరోక్షంగా ప్రధానిని ఉద్దేశించి మాట్లాడుతూ, ప్రజల్లోకి వెళ్లేందుకు ‘కింగ్’కు ధైర్యం సరిపోవడం లేదన్నారు. గత 15 రోజలుగా తాను పార్లమెంటుకు వస్తున్నానని, అనేక అంశాలు సభలో ప్రస్తావించాల్సి ఉన్నప్పటికీ ప్రధానమంత్రి కేవలం 10 నిమిషాలే సభలో కనిపించారని అన్నారు. చివరగా ‘సత్యమేయ జయతే’ అంటూ ప్రియాంక తన చర్చను ముగించారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10