AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

బరితెగించిన గాంజా గ్యాంగ్..

అర్థరాత్రి కత్తులతో 50 మంది వీరంగం
రంగారెడ్డి జిల్లాలో గాంజా బ్యాచ్ రెచ్చిపోయింది. మైలార్ దేవిపల్లిలో ఓ గ్యాంగ్ వీరంగం సృష్టించింది. కత్తులతో, రాళ్లతో దాడి చేసి హల్‌చల్ సృష్టించింది. ఇది చూసి ప్రజలు భయాందోళనకు గురయ్యారు. సినిమాలో క్రైమ్ సీన్‌ను తలపించేలా ఏకంగా 50 మంది గ్యాంగ్‌గా వచ్చి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన ప్రస్తుతం కలకలం రేపుతోంది.

మైలార్‌దేవిపల్లిలో ఓ కుటుంబంపై గాంజా గ్యాంగ్ దాడి చేసింది. 50 మంది గ్యాంగ్ సభ్యులు ఒకేసారి దాడి చేశారు. కత్తులతో కుటుంబంపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో రావుల భాస్కర్ అనే వ్యక్తికి కత్తి పోట్లు పడగా.. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ దాడిని అడ్డుకోవడానికి వచ్చిన స్ధానికులపై కూడా దుండగులు దాడికి పాల్పడ్డారు. రాళ్లు విసిరి రచ్చ రచ్చ చేశారు.

ఈ ఘటనతో ఒక్కసారిగా కాలనీ వాసులు ఉలిక్కిపడ్డారు. ఈ దాడితో ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. దాడిలో గాయపడిన వారిని స్థానికులు హుటాహుటిన దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెబుతున్నారు. కాలనీలో రెండు వర్గాల మధ్య చెలరేగిన గొడవ.. చిలికి చిలికి గాలివానలా మారింది. వాగ్వాదం మరింత పెరగడంతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. రావుల భాస్కర్ కుటుంబసభ్యులు మాట్లాడుతుండగా ప్రత్యర్థి వర్గం రెచ్చిపోయింది. మాకే చెబుతావా? అంటూ దాడికి పాల్పడ్డారు.

శుక్రవారం అర్ధరాత్రి సమయంలో ఈ దాడి జరిగింది. రాత్రి సమయంలో 50 మంది కత్తులతో వచ్చి దాడి చేస్తుండటంతో ఏం జరుగుతుందో అర్ధం కాక కాలనీ వాసులు భయాందోళనకు గురయ్యారు. బాధితుల సమాచారంతో దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను అదుపులోకి తీసుకునేందుకు గాలింపు చర్యలు చేపడుతున్నారు. గంజాయి మత్తులో యువకులు విచక్షణ కోల్పోయి దాడులకు పాల్పడుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. పోలీసులు ఇప్పటికైనా గంజాయి విక్రయిస్తున్న వారిపై చర్యలు తీసుకుని యువతను గంజాయికి బానిస కాకుండా కాపాడాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10