తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. అది కూడా విమానాశ్రయాల ఏర్పాటుకు తన శాయశక్తులా సహకరిస్తానని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు ప్రకటించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ను మర్యాదపూర్వకంగా కలిశారు. సీఎంతో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పలువురు ఈ భేటీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో విమానాశ్రయాల ఏర్పాటు గురించి సీఎం రేవంత్ రెడ్డి తనతో చర్చించినట్లు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు.
సీఎంతో భేటీ అనంతరం ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో విమానాశ్రయాల ఏర్పాటుకు కేంద్రం పూర్తిస్థాయిలో సహకరిస్తుందన్నారు. తమ హయాంలో వరంగల్ విమానాశ్రయాన్ని నూటికి నూరుపాళ్లు పూర్తిచేసేలా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు రామ్మోహన్ నాయుడు తెలిపారు. అలాగే వరంగల్ తో పాటు పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఆదిలాబాద్ విమానాశ్రయాలను అభివృద్ధి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి కోరినట్లు, అందుకు సంబంధించి ఫీజబిలిటీ స్టడీ చేయాల్సి ఉన్నట్లు మంత్రి తెలిపారు.
భద్రాద్రి కొత్తగూడెం, పెద్దపల్లిలలో నివేదిక సానుకూలంగా వస్తే విమానాశ్రయాల ఏర్పాటుకు భూసేకరణకు వెళ్లే అవకాశం ఉందన్నారు. ఆదిలాబాద్ విమానాశ్రయం ప్రస్తుతం తక్షణ శాఖ పరిధిలో ఉందని, ఆ శాఖ నుండి అనుమతి ఉంటే తప్పకుండా తాము ఆ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. ఆదిలాబాద్ కు ఓవైపు చత్తీస్ ఘడ్, మరోవైపు మహారాష్ట్ర సరిహద్దులు ఉన్నాయని, అక్కడ విమానాశ్రయం ఏర్పాటు చేస్తే చాలా వరకు ఉపయోగకరంగా ఉంటుందని కేంద్ర మంత్రి అభిప్రాయపడ్డారు. వరంగల్ లో పూర్తిగా ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ద్వారా విమానాశ్రయాన్ని నిర్మించి చూపిస్తామన్నారు.
కాగా తనను కలిసేందుకు వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి బృందానికి కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు నేరుగా ఎదురొచ్చి స్వాగతం పలకడం విశేషం. మొత్తం మీద ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించినట్లుగానే.. తెలంగాణకు విమానాశ్రయాల కల సాకారం కాబోతుందని చెప్పవచ్చు. తెలంగాణలో కేవలం ఒకే ఒక్క విమానాశ్రయం ఉందని, మరో 4 విమానాశ్రయాల ఏర్పాటుకు కేంద్రం సహకరించాలని ఇటీవల బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో కేంద్ర పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు సానుకూలంగా స్పందించడంతో త్వరలోనే తెలంగాణ ప్రజల చిరకాల కోరిక నెరవేరే అవకాశాలు ఉన్నాయి.