చంద్రబోస్ ను ఘనంగా సన్మానించిన తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ చైర్మన్ డా.ప్రతాని రామకృష్ణ గౌడ్
“నాటు నాటు” పాటకు అందించిన సాహిత్యానికి గాను ఆస్కార్ అవార్డు గెలిచి తెలుగు ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన లిరిసిస్ట్ చంద్రబోస్‌గారిని ఆయన నివాసంలో ఘనంగా సన్మానించారు తెలంగాణా ఫిల్మ్ ఛాంబర్ చైర్మన్ లయన్ డా.ప్రతానిరామకృష్ణగౌడ్ . ఈ సందర్భంగా దుబాయ్‌లో జరగనున్న టిఎఫ్‌సిసి నంది అవార్డుల వేడుకకు చంద్రబోస్‌గారిని ఆత్మీయంగా ఆహ్వానించారు. దుబాయ్ వేదికపై అక్కడి దుబాయ్ ప్రిన్స్ చేతుల మీదుగా చంద్రబోస్ కి టిఎఫ్‌సిసి నంది అవార్డు అందించనున్నారు.
ఈ సందర్భంగా తెలంగాణ ఫిలింఛాంబర్ ఆఫ్ కామర్స్ ఛైర్మన్ డా.ప్రతాని రామకృష్ణగౌడ్ మాట్లాడుతూ.. “చంద్రబోస్‌గారితో నాకు ఎప్పటినుంచో మంచి అనుబంధం ఉంది.. నేను నిర్మించి దర్శకత్వం వహించిన జోడి నెంబర్.1, సర్దార్ పాపన్న, అనేక చిత్రాలకు ఆయన సాహిత్యాన్ని అందించారు.. తన సాహిత్యంతో ఆస్కార్ గెలుచుకుని తెలుగు ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పిన చంద్రబోస్‌గారికి నా హృదయపూర్వక అభినందనలు అని అన్నారు.
ఈ సందర్భంగా ఆస్కార్ విజేత, సాహితీవేత్త చంద్రబోస్ మాట్లాడుతూ…“ సంపూర్ణ భారతీయ చిత్రానికి వచ్చిన మొట్ట మొదటి ఆస్కార్ పురస్కారమిది. అది మన తెలుగుకి, నేను రాసిన పాటకి రావడం మరింత ఆనందగా ఉంది. ఇది మాటల్లో వర్ణించలేని అనుభూతి . స్వప్నంలో కూడా స్వప్నించని స్వప్నం ఇది. ఈ పాట రాసేటప్పుడు కీరవాణి గారు, రాజమౌళి గారు మెచ్చుకుంటే చాలు… ఆ తర్వాత ప్రజలు ఆదరిస్తే చాలు అనుకున్నా. కానీ ఆస్కార్ అవార్డ్ రావడం ఎంతో సంతోషం. ఒక జాతీయ పురస్కారం వస్తే చాలు అదే ఈ జన్మకు సార్థకత అనుకునే వాణ్ని. అలాంటిది నాలుగు అంతర్జాతీయ పురస్కారాలు ఇవ్వడంతో నా జన్మ ధన్యమైంది. చాలా ఆనందంగా ఉంది. అందులో తెలుగు పాటకు ఆస్కార్ వచ్చినందుకు, తెలుగు వారి శక్తి సామర్థ్యాలు విశ్వ వేదికపై చాటి చెప్పినందకు మరింత ఆనందంగా ఉంది. ఈ పాటలో ప్రతి వాక్యం నా భార్య జ్ఞాపకాలు. మా ఊళ్లో నేను అనుభవించిన జీవితం, నా నేపథ్యం, నా పరిసరాలు, నా కుటుంబం… వీటన్నింటిని కలిపి నాటు నాటు పాటగా రాసాను. ఇక తెలంగాణా ఫిల్మ్ ఛాంబర్ తరపున నన్ను సన్మానించిన ఆర్ కె గౌడ్ గారికి, ఛాంబర్ సభ్యులందరికి ధన్యవాదాలు తెలియచేస్తున్నాను. త్వరలో దుబాయిలో జరిగే టి యఫ్ సి సి నంది అవార్డుల వేడుకకు నన్ను ఆహ్వానించినందుకు కృతజ్ఞతలు“ అన్నారు.