బెంగళూరు: చిక్కబళ్లాపుర జిల్లాలో క ఆలయానికి వెళుతున్న కర్నాటక ముఖ్యమంత్రి ఎస్‌ఆర్ బొమ్మై కారును శుక్రవారం ఎన్నికల అధికారులు అడ్డగించి తనిఖీలు నిర్వహించారు. మే 10వ కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా రాష్ట్రంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఇప్పటికే అమలులోకి వచ్చింది. ముఖ్యమంత్రి బొమ్మై కారును ఎన్నికల అధికారులు తనిఖీ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
బుధవారం కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించిన తర్వాత తన అధికారిక కారును ముఖ్యమత్రి బొమ్మై ప్రభుత్వానికి అప్పగించారు. శుక్రవారం ఒక ప్రైవేట్ కారులో ఘటి సుబ్రమణ్య స్వామి ఆలయానికి ముఖ్యమంత్రి వెళుతుండగా హోసహుద్య చెక్‌పోస్టు వద్ద అధికారులు తనిఖీలు జరిపారు. కారులో అభ్యంతరకరమైన వస్తువులేవీ లభించకపోవడంతో అధికారులు ఆయన వాహనాన్ని పంపించివేశారని వర్గాలు తెలిపాయి.