AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

మణిపూర్‌లో మళ్లీ రణరంగం.. రాష్ట్రంలో వెల్లువెత్తిన నిరసనలు

మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్ల ముట్టడి
ఇంటర్నెట్‌ బంద్, కర్ఫ్యూ విధింపు

బీజేపీ పాలిత మణిపూర్‌ మరోసారి భగ్గుమంది. గత ఏడాదిన్నరకు పైగా జాతుల వైరంతో రగులుతున్న రాష్ట్రంలో మరోసారి హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల మైతీలకు చెందిన 10 మంది మహిళలు, చిన్నారులను కుకీ వర్గీయులు అపహరించుకుపోయారు. అయితే వారిలో ఆరుగురు మహిళలు, చిన్నారుల మతదేహాలు లభ్యమయ్యాయి. దీంతో మణిపూర్‌లోని పలు ప్రాంతాల్లో నిరసనలు పెల్లుబికాయి. ఆందోళనకారులు రోడ్లపైకి వచ్చి నిరసనలు వ్యక్తం చేశారు. రోడ్లపై టైర్లను కాలుస్తూ రాకపోకలకు అంతరాయం కలిగించారు. పలు చోట్ల దుకాణాలు, మార్కెట్లను మూసివేశారు. తమకు న్యాయం చేయాలంటూ ఆందోళనకారులు ఇంఫాల్‌లో ఉన్న ముగ్గురు మంత్రులు, ఆరుగురు ఎమ్మెల్యేల గృహాలను ముట్టడించి ఆస్తులను ధ్వంసం చేశారు.

సీఎం ఇల్లు ముట్టిడికి యత్నం..
ముఖ్యమంత్రి బీరేన్‌ సింగ్‌ ఇంటిని ముట్టడించేందుకు ప్రయత్నించారు. ఇండిపెండెంట్‌ ఎమ్మెల్యే సపమ్‌ నిశికాంత సింగ్‌ ఆ సమయంలో గృహంలో లేకపోవడంతో ఆయనకు చెందిన దినపత్రిక కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. దీంతో శనివారం సాయంత్రం 4.30 గంటల నుంచి ఇంఫాల్‌ పశ్చిమ, తూర్పు జిల్లాల్లో నిరవధిక కర్ఫ్యూ విధించారు. ముందు జాగ్రత్త చర్యగా ఇంఫాల్‌ వెస్ట్, ఈస్ట్, బిష్ణుపూర్, తౌబల్, కక్‌చింగ్, కంగ్‌పోక్పీ, చురాచాంద్‌పూర్‌ జిల్లాల్లో ఇంటర్నెట్‌ సేవలను రెండు రోజుల పాటు నిలిపివేశారు. తొలుత జిరి నది వద్ద శుక్రవారం సాయంత్రం మూడు మృతదేహాలు, బారక్‌ నదీ ప్రాంతంలో శనివారం మరో మూడు మృతదేహాలు కన్పించాయి. ఆ ఆరు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పంపారు.

అసలేం జరిగిందంటే..
ఇటీవల కుకీ మిలిటెంట్లు, సీఆర్‌పీఎఫ్‌ దళాలకు మధ్య ఎన్‌ కౌంటర్‌ చోటుచేసుకోగా, 10 మందిని భద్రతా దళాలు హతమార్చాయి. ఈ ఘటన అనంతరం జిబ్రామ్‌లోని బోరోబెక్రాలో ఒక మహిళ, ఆమె ఇద్దరు కుమార్తెలు, ముగ్గురు మైనర్ల సహా మైతీలకు చెందిన 10 మంది కన్పించకుండా పోయారు. వీరిని కుకీలే అపహరించుకుపోయారని ఆరోపణ. జూన్‌లో మణిపూర్‌లో జరిగిన హింసాత్మక ఘటనల అనంతరం మైతీలకు చెందిన చాలామంది మహిళలు, పిల్లలు బోరోబెక్రా పోలీస్‌ స్టేషన్‌ సమీపంలో ఏర్పాటు చేసిన సహాయ శిబిరాలలో ఉంటున్నారు. సోమవారం సీఆర్‌పీఎఫ్‌ క్యాంప్‌పై దాడి చేసిన కొందరు సాయుధులైన కుకీ మిలిటెంట్లు ఈ శిబిరాలలోని వారిని అపహరించుకుపోయారని పలు సంస్థలు ఆరోపించాయి.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10