న్యూఢిల్లీ: ఇంట్లో దోమలను తరిమికొట్టేందుకు దోమలబత్తీలు వాడుతుంటాము. కానీ దోమలబత్తీ కారణంగా ఒకే కుటుంబలో ఆరుగురి ప్రాణాలు కోల్పోయిన విషాద సంఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. దోమలబత్తీ అంటుకుని గురువారం అర్ధరాత్రి ఇంట్లో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఊపిరాడక చిన్నారి సహా ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. అనంతరం ఈ ఘటనపై విచారణ చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.