తెలంగాణలో సమగ్ర ఇంటింటి సర్వే కొనసాగుతోంది. ఇప్పటికే మొదటి దశలో ఇళ్లకు స్టిక్కర్లు అతికించే పనులు పూర్తయ్యాయి. దీంతో శనివారం నుంచి రెండోదశ పనులు ప్రారంభమయ్యాయి. ఇక నుంచి అధికారులు ప్రతీ ఇంటికి వెళ్లి వ్యక్తిగత, ఫ్యామిలి వివరాలు సేకరిస్తారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ సర్వే కోసం మొత్తం 243 కులాలను గుర్తించింది. వీటన్నింటికీ కోడ్స్‌ను కూడా కేటాయించింది. అధికారులు తమ ప్రశ్నపత్రంలో ఆయా కుటుంబాల కులానికి సంబంధించిన కోడ్ కేటాయించాల్సి ఉంటుంది.
ఎస్సీ కేటగిరిలో 59 కులాలు ఉండగా, ఎస్టీ కేటగిరిలో 32 కులాలు ఉన్నాయి. బీసీ కేటగిరిలో ఏ,బీ,సీ,డీ, ఈబీసీ కలిపి మొత్తం 134 కులాలు ఉన్నాయి. ఇక ఓసీలో 18 కులాలు ఉన్నాయి. అయితే ఓసీ కేటగిరీలో బుద్ధిస్టులను, జైన్లలను కూడా చేర్చారు. అలాగే మతపరమైన కేటిగిరిలో కూడా బుద్ధిస్టు, జైన్లకు వేరువేరు కోడ్‌లను ఇచ్చారు. అలాగే ఎస్సీ కేటగిరీ నుంచి క్రైస్తవులుగా మారిపోయిన వాళ్లని బీసీ ‘సీ’ లుగా వర్గీకరించారు. నిరాశ్రయుల వారసులు, అనాథలను బీసీ ఏ కేటగిరీ కిందకు చేర్చారు. బీహార్, ఏపీ తర్వాత కులగణన చేపట్టిన మూడో రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది.
ఇదిలాఉండగా దేశంలో కులగణన జరగాలని కాంగ్రెస్ ఎప్పటినుంచో వాదిస్తోంది. విపక్ష నేత రాహుల్ గాంధీ కూడా కులగణన దేశానికి ఎక్స్‌రే లాంటిదని కూడా చెప్పారు. 50 శాతం వరకే పరిమితి ఉన్న రిజర్వేషన్లను పెంచాల్సిన అవసరం ఉందని చెప్పారు. మరోవైపు బీసీలు కూడా తమకు అన్యాయం జరుగుతోందని కులగణన చేపట్టి రిజర్వేషన్లు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలతో పాటు ఇతర వెనుకబడిన కులాలకు సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ అవకాశాలను మెరుగుపరిచేందుకు రేవంత్ ప్రభుత్వం కులగణన పక్రియను చేపట్టింది. ప్రస్తుతం జరుగుతున్న ఈ సమగ్ర కుటుంబ సర్వేను 60 రోజుల్లో పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యం పెట్టుకుంది.