తన పుట్టిన రోజు సందర్భంగా మొదలుపెట్టిన మూసీ పునరుజ్జీవ సంకల్ప యాత్రలో సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈరోజు మొదలుపెట్టిన పాదయాత్ర కేవలం ట్రైలర్ మాత్రమేనని.. అసలు సినిమా జనవరిలో ఉందని రేవంత్ రెడ్డి వెల్లడించారు. జనవరి మొదటివారంలో వాడపల్లి నుంచి పాదయాత్ర చేయనున్నట్టు రేవంత్ రెడ్డి ప్రకటించారు. చార్మినార్ వద్ద లక్షల మంది సమక్షంలో మూసీ పునరుజీవ ప్రాజెక్టును ప్రారంభించనున్నట్టు రేవంత్ రెడ్డి ప్రకటించారు. మూసీ ప్రక్షాళనకు ఎవరు అడ్డం వచ్చినా బుల్డోజర్లు ఎక్కించి తొక్కించుకుంటూ వెళ్లి ప్రాజెక్టు పూర్తి చేస్తామంటూ సంచలన కామెంట్లు చేశారు.
తన పుట్టిన రోజు సందర్భంగా యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని సందర్శించిన రేవంత్ రెడ్డి.. ఆనంతరం ఆలయ అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం.. సంగెం గ్రామంలో మూసీ పునరుజ్జీవ సంకల్ప పాదయాత్రను మొదలు పెట్టి.. భీమలింగం, ధర్మారెడ్డిపల్లి కెనాల్ నుంచి నాగిరెడ్డిపల్లి వరకు 2.5 కిలోమీటర్ల మేర తన పాదయాత్రను కొనసాగించారు. మూసీలోని భీమలింగానికి ప్రత్యేక పూజలు నిర్వహించిన రేవంత్ రెడ్డి.. అనంతరం బోటులో కాస్త దూరం ప్రయాణించి.. మూసీ ప్రవాహాన్ని, నీటి దుస్థితిని పరిశీలించారు. అనంతరం.. నాగిరెడ్డిపల్లిలో నిర్వహించిన సభలో రైతులు, ముదిరాజ్‌లు, గౌడులు తెలిపిన సమస్యలను విన్నారు.
అనంతరం ప్రసంగించిన రేవంత్ రెడ్డి.. ఘాటు వ్యాఖ్యలు చేశారు. మూసీ అణుబాంబు కంటే ప్రమాదంగా మారబోతోందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. సమాజంలో చాలా మంది దుర్మార్గులు ఉంటారని.. అందులో బీఆర్‌ఎస్ ముందు ఉంటుందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మూసీ ప్రాజెక్టు కోసం రూ.లక్షా 50 వేల కోట్లు ఖర్చు పెడుతున్నారని.. అందులో రూ.25 వేల కోట్లు రేవంత్ రెడ్డి దోచుకుంటున్నాడని కొందరు ఆరోపిస్తున్నారని చెప్పుకొచ్చారు. తాను దోచుకోవాలని అనుకుంటే.. నల్గొండ ప్రజలు సొమ్ము అవసరమా.. ధరణిలో కోకాపేటపై ఫోకస్ పెడితే 50 కోట్ల భూమి కబ్జా చేయరాదా అంటూ కీలక కామెంట్లు చేశారు.
మరోవైపు.. బీజేపీ నేతలపై కూడా ఘాటు విమర్శలు చేశారు రేవంత్ రెడ్డి. పీఎం నరేంద్ర మోదీ.. గుజరాత్‌లో సబర్మతి నదిని, గంగా నదిని ప్రక్షాళన చేస్తుంటే గొప్పగా పొగిడారని.. అదే తెలంగాణలో మూసీని బాగు చేసుకుంటే రకరకాల విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇదిలా ఉంటే.. కేటీఆర్, హరీష్ రావుపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు రేవంత్ రెడ్డి. బుల్డోజర్‌లకు అడ్డం పడుకుంటామని కొందరు అంటున్నారని.. “ఎవరు అడ్డం వస్తారో రండి.. ఎంతో మంది వస్తారో రండి.. మీ జాతి మొత్తాన్ని తెచ్చుకున్నా సరే.. అందరినీ బుల్డోజర్ ఎక్కించి తొక్కిస్తా..” అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.