గత పాలనలో మూసీ పేరుతో రూ.వెయ్యి కోట్ల లోన్
మరి ఇప్పుడు ఎందుకు అడ్డుకుంటున్నారు?
పేదల ఆరోగ్యంపై చెలగాటమా?
మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఫైర్
(అమ్మన్యూస్, హైదరాబాద్):
మూసీ ప్రక్షాళనపై ప్రతిపక్షాల విమర్శలను మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తిప్పికొట్టారు. ఎవరెన్ని విమర్శలు చేసినా మూసీ నది ప్రక్షాళన జరిగి తీరుతుందన్నారు. మంత్రిగా ఉన్న సమయంలో కేటీఆర్ మూసీ డెవలప్ మెంట్ ఫండ్ కింద రూ.వెయ్యి కోట్లు లోన్లు తీసుకున్నారని, ఇప్పుడు తాము అభివృద్ధి చేస్తుంటే ఎందుకు అడ్డుకుంటున్నారని నిలదీశారు. శుక్రవారం హైదరాబాద్ నోవాటెల్ లో నిర్వహించి అర్బన్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ సమ్మిట్ లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నాచారం, జీడిమెట్ల, పరిశ్రమలతో పాటు మూసీ వెంట ఉన్న అనేక పరిశ్రమలు తమ వ్యర్థ జలాలను మూసీలోకి వదులుతున్నాయన్నారు. మూసీ దుర్వాసనతో లక్షలాది మంది ఇబ్బందులు పడుతున్నారని, క్యాన్సర్ వంటి మహహ్మారి రోగాల బారిన ప్రజలు పడుతున్నారన్నారు. సబర్మతి, నమామి గంగే ప్రాజెక్టులు చేసినట్లుగానే మూసీని ఎందుకు ప్రక్షాళన చేయకూడదనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. మూసీ నిర్వాసిత ప్రజలు ప్రభుత్వానికి సహకరించేందుకు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారని చెప్పారు.
జీహెచ్‌ఎంసీ.. నాలుగు కార్పొరేషన్లు
హైదరాబాద్ వంటి నగరం జనాభా రోజు రోజుకు పెరిగిపోతున్నదని, భవిష్యత్ అవసరాల దృష్ట్యా జీహెచ్‌ఎంసీని నాలుగు కార్పొరేషన్లు విభజించబోతున్నామని ప్రకటించారు. రాజకీయంగా విమర్శించే వాళ్లు విమర్శిస్తూనే ఉంటారని కానీ ప్రజల ఆరోగ్యం కోసం ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తామన్నారు. తర్వాత ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలు ఉంటాయో అనేది ఆలోచించకుండా కేవలం ప్రజల ప్రయోజనార్థమే ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. మల్లన్నసాగర్ నిర్వాసితులు ఆందోళన చేస్తున్నా వారిని పట్టించుకోకుండా కేసీఆర్ కాళేశ్వరం నిర్మిస్తే అది కాస్తా కూలిపోయి రూ.2 లక్షల కోట్లు నీటిపాలైందన్నారు.
మూసీ సుందరీకరణ కోసం రూ.1.50 కోట్లా అని కేటీఆర్ ప్రశ్నిస్తున్నారు. కానీ డీపీఆర్ సిద్ధం చేయకముందే కేటీఆర్ ఆ ఆరోపణలు చేయడం ఏంటని ప్రశ్నించారు. కావాలనే ప్రభుత్వాన్ని బద్నాం చేయాలనే విమర్శలు చేస్తున్నారని కానీ ఎట్టి పరిస్థితుల్లో ముసీ ప్రక్షాళన చేస్తామన్నారు. దాదాపు రూ. 30 వేల కోట్ల వ్యయంతో రీజినల్ రింగ్ రోడ్డును నిర్మించబోతున్నామని ఈ రీజినల్ రింగ్ రోడ్డు గేమ్ చేంజర్ గా మారుతుందన్నారు. ఈ రోడ్డు 50 శాతం తెలంగాణను కవర్ చేస్తుందని, వచ్చే నవంబర్ టెండర్లు పిలుస్తామన్నారు. వంద ఎకరాల్లో కొత్త హైకోర్టు భవనాన్ని నిర్మించబోతున్నామని చెప్పారు.