AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

పేదలు మురికిలోనే ఎందుకు బతకాలి?.. బీఆర్‌ఎస్, బీజేపీలు కుమ్మక్కు.. అందుకే డ్రామాలు

హైడ్రాను అడ్డుకునేందుకే వీరి నాటకాలు
– వారి ఫాంహౌస్‌లు ఎక్కడ కూలుతాయోననే వారి బెంగ
– పేదలపై మీకు ప్రేమ ఉంటే మీ దగ్గర ఉన్న వేల కోట్ల డబ్బును పంచాలి
– తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సవాల్‌
– సరికొత్త విప్లవం.. వన్‌ స్టేట్‌–వన్‌ కార్డ్‌ అంటూ స్పష్టీకరణ

(అమ్మన్యూస్, హైదరాబాద్‌):
‘మూసీ’పై వెనక్కి తగ్గెదేలేదు.. ప్రక్షాళన చేసి తీరుతాం.. పేదలు మురికిలోనే ఎందుకు బతకాలి?.. హైడ్రాను అడ్డుకునేందుకే బీజేపీ, బీఆర్‌ఎస్‌ ఒక్కటై నాటకాలు అడుతున్నాయి. వారి ఫాంహౌస్‌లు ఎక్కడ కూలుతాయోననే వారి బెంగ.. నిజంగా మీకు పేదలపై ప్రేమ ఉంటే మీ దగ్గర ఉన్న వేల కోట్ల డబ్బును పంచాలి.. త్వరలోనే ఒక్కొక్కరి తాటా తీస్తా..’ నంటూ సీఎం రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వన్‌ స్టేట్‌–వన్‌ కార్డ్‌తో తెలంగాణలో మరో కొత్త విప్లవానికి కాంగ్రెస్‌ ప్రభుత్వం నాంది పలుకుతోందని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అన్నారు. గురువారం సికింద్రాబాద్‌ లోని సిఖ్‌ కాలనీలో ఫ్యామిలీ డిజిటల్‌ కార్డ్‌ (ఎఫ్‌డీసీ) పైలట్‌ కార్యక్రమాన్ని సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో.. ప్రతి నియోజకవర్గంలోని రెండు గ్రామాల్లో ఈ పైలట్‌ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్టు తెలిపారు. ఈ పైలట్‌ సర్వేను ఐదు రోజుల్లో పూర్తి చేసి.. ఈ విధానంలో గల మార్పులు చేర్పులను గమనించి, రాష్ట్రమంతటా ఫ్యామిలీ డిజిటల్‌ కార్డుల పంపిణీ చేస్తామని అన్నారు.

మహిళనే ఇంటి యజమానురాలు..
మహిళలకు కాంగ్రెస్‌ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని.. అందులో భాగంగానే ఫ్యామిలీ డిజిటల్‌ కార్డుల్లో ఆ ఇంటి మహిళను ఇంటి యజమానురాలిగా ఉంచుతామన్నారు. రేషన్‌ కార్డులు వేరు, ఫ్యామిలీ డిజిటల్‌ కార్డులు వేరని.. ఈ ఫ్యామిలీ డిజిటల్‌ కార్డుల్లో కుటుంబంలోని ప్రతీ ఒక్కరి ఆరోగ్య వివరాలతోపాటు ఆ ఇంట్లో వారు పొందుతున్న పథకాలన్నిటి వివరాలు ఉంటాయన్నారు. ప్రభుత్వం దగ్గర ఉన్న 30 శాఖల సమాచారాన్ని క్రోడీకరించి ఫ్యామిలీ డిజిటల్‌ కార్డులు రూపొందిస్తున్నామని సీఎం వెల్లడించారు.

కాళ్లు అరిగేలా తిరిగినా రేషన్‌ కార్డు ఇవ్వని బీఆర్‌ఎస్‌..
బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉన్నపుడు పేదవాళ్ళకి రేషన్‌ కార్డులు ఇవ్వలేదని, రేషన్‌ కార్డుల కోసం కాళ్లు అరిగేలా వారి చుట్టూ తిరిగి అలసిపోయి వారిని ఇంటికి పంపించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం పేదల ప్రభుత్వంఅని తాము అధికారంలోకి వచ్చిన 10 నెలల్లోనే పేదలకు ఉపయోగపడే అనేక సంక్షేమ పథకాలను రూపొందిస్తున్నామని పేర్కొన్నారు. ఈ ఫ్యామిలీ డిజిటల్‌ కార్డ్‌ లో ఎప్పుడు అవసరమైతే అప్పుడు సమాచారం మార్చుకునే వెసులుబాటు ఉందని, అన్ని కార్డులకు ఫ్యామిలీ డిజిటల్‌ కార్డ్‌ కేరాఫ్‌ అడ్రస్‌ గా నిలుస్తుందని సీఎం వివరించారు.

విపక్షాలవి డ్రామాలే..
మూసీ మీద విపక్షాలు అనవసర డ్రామాలు ఆడుతున్నారని సీఎం రేవంత్‌ రెడ్డి మండిపడ్డారు. మూసీ పక్కనే ఆ మురికిలో పేదలు ఎందుకు బతకాలని రేవంత్‌ రెడ్డి ప్రశ్నించారు. మూసీ నదిని ప్రక్షాళన చేస్తే నగర ప్రజలకు రోగాలు తప్పుతాయని, అక్కడి ప్రజలు గౌరవంగా బతుకుతారని పేర్కొన్నారు. గుజరాత్‌ లో అనేక నదుల ప్రక్షాళనకు ముందుకు వస్తున్న బీజేపీ ప్రభుత్వం, ఆ పార్టీ నేతలు, ఇక్కడ మాత్రం ఎందుకు అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. పేద ప్రజలను అడ్డుపెట్టుకొని హైడ్రా ను ఆపాలని బీఆర్‌ఎస్‌ చూస్తోందని.. నిజానికి బీఆర్‌ఎస్‌ నాయకుల ఫామ్‌ హౌస్‌ లు ఎక్కడ కూలుతాయో అనే భయం వల్లనే హైడ్రా మీద బురద జల్లుతూ చిల్లర రాజకీయాలు చేస్తున్నారని సీఎం గులాబీ నేతలను ఎండగట్టారు. పేదల మీద అంత ప్రేమ ఉంటే మీ పార్టీల అకౌంట్లలో ఉన్న వందల కోట్లను పంచాలని సీఎం రేవంత్‌ రెడ్డి విపక్షాలకు సవాల్‌ విసిరారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌ రెండు పార్టీలు కుమ్మక్కయి నాటకాలు ఆడుతున్నాయని.. వారి ఒక్కొక్కరి తాట తీసే రోజు దగ్గర్లోనే ఉందని హెచ్చరించారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10